టీడీపీ డాక్టర్స్ సెల్ మాజీ ప్రెసిడెంట్ కు వేల కోట్ల కాంట్రాక్టు
చక్రం తిప్పిన కీలక యువ మంత్రి..ఆయనకూ భారీగా వాటాలు
పోటీ లేకుండా చేసేందుకు రకరకాల వ్యూహాలు!
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన హవా అంతా ఇంతా కాదు. టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన ఏది కోరుకుంటే అది దక్కించుకునే స్థాయిలో ఉన్నారు అని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. ఎందుకంటే మాటకు ముందు ఆయన సార్ డాక్టర్ ను..మేడమ్ డాక్టర్ ని అని చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా సీఎంఓ లోని కీలక ఐఏఎస్ అధికారి ఒకరు...ఆ అధికారి కార్యాలయ సిబ్బంది కూడా సదరు డాక్టర్ కోరుకున్న పనులు అన్ని చేసిపెడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. వీళ్లతోనే ఆగలేదు ...ఇప్పుడు ప్రభుత్వంలో ఏ కీలక మంత్రి చెపితే పనులు క్షణాల్లో అయిపోతాయో ఆయనతోనే అన్నీ మాట్లాడుకుని ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు దక్కించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన పేరే పవన్ కుమార్ దోనేపూడి. గతంలో ఆయన తెలుగు దేశం పార్టీ డాక్టర్స్ సెల్ ప్రెసిడెంట్ గా కూడా పని చేశారు అని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇదే ఇప్పుడు ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల పనులు దక్కించుకోవటానికి మార్గం సుగమం చేసింది అనే ప్రచారం ఉంది.
ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వాళ్ళకే వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు అన్నట్లు పరిస్థితి తయారు అయింది ఏపీలో అని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి . అది రాజధాని అమరావతి అయినా. ఆంధ్ర ప్రదేశ్ వైద్య శాఖలో అయినా అలాగే ఉంది వ్యవహారం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో 108 సర్వీస్ లను ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించేవి. తొలుత సత్యం కంప్యూటర్స్ కు చెందిన సత్యం ఫౌండేషన్, ఎమర్జెన్సీ మేనేజిమెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈఎంఆర్ఐ), ఆ తర్వాత జీవీకె, ఈఎంఆర్ఐ లు సంయుక్తంగా ఈ బాధ్యతలు చేపట్టాయి. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఫస్ట్ టర్మ్ లో కూడా జీవికె నే ఈ బాధ్యతలు చూసింది. జగన్ హయాంలో అరబిందో కంపెనీకి ఈ బాధ్యతలు అప్పగించారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు తమకు కావాల్సిన వాళ్లకు...అస్మదీయ కంపెనీలకు వీటి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి సర్కారు కూడా అదే తరహా విమర్శలు ఎదుర్కొంటోంది. ఎందుకంటే అత్యంత కీలక మైన 108 తో పాటు 104 సర్వీసులు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం బాధ్యతలను కూడా టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించింది. ఈ సంస్థ బెంగళూరు కు చెందిన ఎస్ఆర్ఐటి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే గత జగన్ సర్కారులో చెల్లించిన మొత్తం కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ సంస్థకు పెద్ద ఎత్తున అదనపు మొత్తాలు చెల్లిస్తోంది అని అధికార వర్గాలు వెల్లడించాయి.
దీని కోసం అదనపు సేవలు అనే ఒక ముసుగు కూడా వేశారు అని ..ఈ సంస్థలు చేసే పనులను ప్రభుత్వంలో అసలు రివ్యూ చేసే పరిస్థితి ఉంటుందా అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సందేహం వ్యక్తం చేశారు. ఈ లెక్కన నాలుగు సంవత్సరాల్లో గతంలో వీటి నిర్వహణలో ఏ మాత్రం అనుభవం లేని కంపెనీకి వేల కోట్ల రూపాయల పనులు అప్పగించినట్లు అయింది అని చెపుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ఇతర సంస్థలు ఏవీ కూడా రేస్ లోకి వచ్చే అవకాశం లేకుండా ఈ కంపెనీకి మేలు చేసేందుకే టెండర్ నిబంధనల్లో కూడా మార్పులు చేసినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఒక యువ మంత్రి ఉన్నారని..అందుకే ఈ కంపెనీకి ఇంత భారీ ప్రాజెక్ట్ దక్కినట్లు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.
కానీ ఊహించని విధంగా ఒక ముంబై కంపెనీ టెండర్ వేసినా కూడా ఆ కంపెనీ టెండర్ ని రిజెక్ట్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఆ సంస్థకు అర్హత ఉంది అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. గతంలో పెద్ద పెద్ద కంపెనీలు చేసిన ఈ పని ని ఇప్పుడు ప్రభుత్వంలోని పెద్దలు తమకు కావాల్సిన వాళ్లకు ఈ టెండర్ కేటాయించి భారీ ఎత్తున లబ్దిచేకూర్చినట్లు చెపుతున్నారు. ఇది అంతా కూడా పైస్థాయిలోనే జరిగిపోయింది అని..ఇతర కంపెనీలు ఏవి కూడా పోటీకి రాకుండా కొంత మందిని బెదిరించారు అని కూడా ఒక అధికారి తెలిపారు. అంతే కాకుండా ఏ శాఖ పరిధిలో అయితే ఈ వ్యవహారాలు ఉంటాయో వాళ్ళతో పెద్దగా పనిలేకుండా అంతా పై స్థాయిలోనే జరిగిపోయినట్లు కూడా చెపుతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చాలు తనకు ఈ ప్రాజెక్ట్ లు వస్తాయని చెప్పి మరీ దోనేపూడి పవన్ కుమార్ వీటిని దక్కించుకున్నట్లు కొంత మంది అధికారులు వెల్లడించారు.