చంద్రబాబు విధానమే పవన్ ..నాదెండ్ల విధానమా ?!

Update: 2025-11-29 08:05 GMT

అప్పుడు వ్యతిరేకించి..ఇప్పుడు ఒకే !

మధ్యలో మారింది ఏంటో!

తెర వెనక వ్యవహారాలే కీలకంగా మారుతున్నాయని చర్చ!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది చెపితే దానికి ఓకే చెప్పటమేనా జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విధానం. రాజధాని అమరావతి కి రైతుల దగ్గర నుంచి 33000 వేల ఎకరాలను సమీకరించటంపై గతంలో పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు రాజధాని నిర్మాణానికి ఇంత భూమి అవసరం ఏముంది అని కూడా ప్రశ్నించారు. అసలు 33000 ఎకరాలే రాజధానికి చాలా ఎక్కువ అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం మళ్ళీ రాజధాని విస్తరణ కోసం ప్రభుత్వం రెండవ విడత భూ సమీకరణ పేరుతో మరో 16666 ఎకరాలు సమీకరించటానికి సిద్ధం అయింది. ఈ ప్రతిపాదనకు శుక్రవారం నాడు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆమోద ముద్ర కూడా వేశారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర జనసేన మంత్రులు కూడా భాగస్వాములు అయ్యారు. అవసరం అయితే తర్వాత మరింత భూ సేకరణ, సమీకరణ చేస్తామని కూడా ప్రభుత్వం చెపుతోంది. అసలు తొలిదశ రాజధాని అమరావతి పనులు ఇంకా ఆశించిన స్థాయిలో ఊపు అందుకోలేదు. కానీ అప్పుడే రెండవ దశ కోసం అంటూ మరో సారి భూ సమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలపటంతో మరో సారి పవన్ కళ్యాణ్ తీరు చర్చనీయాంశంగా మారింది. కొద్ది నెలల క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కొత్తగా నలభై వేల ఎకరాల భూ సమీకరణపై జనసేన కు చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో మంత్రి నాదెండ్ల మనోహర్ లు అభ్యంతరం చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

                                  అందు కే అప్పటిలో ప్రభుత్వం తాత్కాలికంగా ఈ విషయాన్ని పక్కన పెట్టి..ఇప్పుడు మళ్ళీ తెర మీదకు తెచ్చింది. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి ఇంకా కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం ఒక త్రీ మెన్ కమిటీ ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అసలు గతంలో ఎప్పుడూ అమరావతి విస్తరణ ప్రాజెక్ట్ ఊసు ఎత్తని చంద్రబాబు రెండసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొత్త రాగం అందుకున్నారు. లేదు అంటే అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోవుతుంది అని భూములు ఇచ్చిన రైతులను ఒక రకంగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది అనే చర్చ కూడా టీడీపీ నేతల్లో ఉంది. ఈ తొలి దశ ప్రాజెక్ట్ ఒక రూపు తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనే అనుమానాలు టీడీపీ నేతల్లోనే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఐదు వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, 2500 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రీస్ అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టారు. ముందు తొలి దశ ఎప్పుడు పూర్తి కావాలి..తర్వాత ఇవి అన్ని ఎప్పుడు టేక్ ఆఫ్ కావాలి. అసలు వీటి అన్నిటికి నిధులు ఎక్కడ ఉన్నాయి.

                                   ఇలాంటి ప్రశ్నలు ఎన్నో రైతుల మెదళ్లలో ఉదయిస్తున్నాయి. రైతులు అంగీకరిస్తే చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో లక్ష ఎకరాలు సమీకరించినా కూడా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు ఒకే చెప్పేలా ఉన్నారు అని ఒక టీడీపీ మంత్రి వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇది అంతా కూడా వ్యూహం ప్రకారం...ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అని ఆయన వెల్లడించారు. రాజధాని వస్తే తమ భూములకు మంచి విలువ వస్తుంది అనే రైతులు భూములు పూలింగ్ లో ఇచ్చారు. కానీ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే దీనికి ఎంతో కాలం పడుతుందో అన్నది ఎవరి ఊహకు కూడా అందటం లేదు. దీంతో రైతుల్లో కూడా ఒకింత ఆందోళన ఉంది అని చెపుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ అదనపు భూ సమీకరణ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News