సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావు ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సీఎస్ లు..ఉన్నతాధికారులు కూడా ఫైళ్ళ మీద గుడ్డిగా సంతకం చేయటం..ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో ఇలా కేసు ఓడిపోవటనికి కారణం ఎవరు అని ప్రశ్నించారు. ఏ బావ కళ్ళలో ఆనందం కోసం..ఏ శాడిస్ట్..ఏ సైకో కళ్ళలో ఆనందం కోసం ఇది అంతా చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోకల్ అని..ఎవరిని వదిలిపెట్టనని వ్యాఖ్యానించారు. సస్పెన్షన్‌ను ప్రశ్నించడమే తన తప్పా..? అని ఏబీవీ నిలదీశారు.ఈ కేసు రెండేళ్ల రెండు నెలలపాటు కొనసాగిందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. న్యాయవాదులకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. ఒక తప్పుడు నివేదిక ఆధారంగా 24 గంటల్లో తనను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరునెలల కోసారి సస్పెన్షన్ పొడిగిస్తూ రిపోర్టులిచ్చారన్నారు. ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించిన అధికారులపై ఫిర్యాదు చేశానన్నారు. కొనుగోలు అనేదే లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. తనను, తన కుటుంబాన్ని క్షోభ పెట్టి ఏం సాధించారన్నారు.
ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన అధికారుల నుంచి.. రెవెన్యూ రికవరీ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.అంతకు ముందు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావుకు అనుకూలంగా సుప్రీం తీర్పును వెల్లడించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ఉన్నతన్యాయస్థానం రద్దు చేసింది. ఏబీవీ సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. రెండేళ్ల సస్పెన్షన్ కాలం పూర్తి అయినందున ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ కొనసాగేది లేదని సుప్రీం స్పష్టం చేసింది. 1969 అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కొనసాగబోదని తేల్చిచెప్పింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి అన్ని బెనిఫిట్స్ వర్తిస్తాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీ ఉన్నతన్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు స్పష్టం చేశారు.