ఏపీ డీజీపీపై ఫోర్జరీ ఆరోపణలు చేసిన ఏబీ

Update: 2021-04-10 11:31 GMT

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయన తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాశారు. అందులో సంచలన ఆరోపణలు చేశారు.అంతే కాదు ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఫోర్జరీ లేఖలకు సంబంధించి తన ఆరోపణలను రుజువు చేసే 9 పత్రాలను తన లేఖకు జోడించారు ఏబీ. డీజీపీ తన స్వహస్తాలతో ఫోర్జరీ చేసినట్టు ఆధారాలను లేఖకు జత చేశారు. డీజీ సవాంగ్, సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్, ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు, ఇంటెలిజెన్స్ అధికారులు, మరికొందరి ప్రమేయానికి సంబంధించిన పత్రాలు అందజేశారు.

తనపై ఎంక్వయిరీస్ కమిషనర్ జరిపిన విచారణ సందర్భంగా దొంగ డాక్యుమెంట్లను సమర్పించారని గతంలోనే ఏబీవీ ఆరోపించారు. సీబీఐతో విచారణకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఫోర్జరీలు, దొంగ డాక్యుమెంట్లతో ప్రభుత్వాన్ని కొందరు పోలీస్ అధికారులు తప్పుదారి పట్టించిన తీరును 1994లో జరిగిన నంబి నారాయణన్ ఉదంతంతో ఆయన పోల్చారు. నంబి నారాయణన్ కేసులో అప్పటి డీజీపీ, ఇంటలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్‌పై ఆరోపణలు ఉన్నాయి. సుప్రీమ్ కోర్టు జోక్యంతో ఇప్పటికీ ఆ కేసులో విచారణ కొనసాగుతోంది. తప్పుడు కేసు బనాయించినందుకు గానూ నంబి నారాయణ్‌కు కోటి 30 లక్షల రూపాయల పరిహారాన్ని కేరళ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు.

Tags:    

Similar News