నాసాకూ చిక్కని విక్రమ్ ల్యాండర్ ఆచూకి

Update: 2019-09-27 04:25 GMT

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) కు కూడా చంద్రయాన్-2కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకి చిక్కలేదు. కాకపోతే విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతం ఇదే కావొచ్చు అంటూ కొన్ని ఫోటోలను తాజాగా విడుదల చేసింది. చంద్రుడి ఉపరితలాన్ని విక్రమ్ ల్యాండర్ గట్టిగా ఢీకొట్టినట్లు నాసా అంచనా వేస్తోంది. ఇస్తో శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్ ను ఎక్కడైతే సాఫ్ట్ ల్యాండ్ కోసం టార్గెట్ ఫిక్స్ చేశారో ఆ ప్రాంతానికి చెందిన ఫోటోలను నాసాకు చెందిన లూనార్ రీకానిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ ఓ) కెమెరా ఫోటోలు తీసింది. వీటినే నాసా శుక్రవారం నాడు విడుదల చేసింది. ఫోటోలు తీసిన సమయంలో ఆ ప్రాంతం అంతా చీకటిగా ఉందని..ఇవి సెప్టెంబర్ 17 నాటి ఫోటోలు అని పేర్కొన్నారు.

అక్టోబర్ లో వెలుతురు ఉండే సమయంలో ఎల్ఆర్ ఓ విక్రమ్ ల్యాండింగ్ ప్రదేశానికి దగ్గరగా వెళుతుందని ఆ సమయంలో మరిన్ని వివరాలు దొరికే ఛాన్స్ ఉందని నాసా తెలిపింది. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చంద్రయాన్ 2లో ఎంతో సంక్లిష్టమైన విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ విఫలమైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7న విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉంది. కానీ ఇస్రోతో సంబంధాలు కట్ కావటంతో ఈ ప్రయోగం విఫలమైనట్లు గుర్తించారు. చంద్రయాన్ 2లో ఇదే కీలకం అన్న విషయం తెలిసిందే.

Similar News