మాయ లెక్కలతో మభ్య పెట్టే ఎత్తుగడ

Update: 2024-04-27 14:32 GMT

గత నాలుగు విడతలుగా ఇచ్చినవి కొత్త మ్యానిఫెస్టో లో పెట్టి మాయ

భోగాపురం ఎయిర్ పోర్ట్ మ్యానిఫెస్టో లో పెట్టక పోయినా కడుతున్నారు అట

జిల్లా కు ఒక ఎయిర్ పోర్ట్ ఎక్కడ మరి?

వైసీపీ మ్యానిఫెస్టో లో కనిపించని ఐటి సెక్టార్ ఊసు

జిల్లాల్లో పీపీపీ పద్దతిలో పారిశ్రామిక పార్కులు

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటలు చూస్తే మాట మీద నిలబడటానికి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటారు. జగన్ కూడా పదే పదే అదే మాట చెప్పుకుంటూ తనను తాను మార్కెటింగ్ చేసుకుంటారు. చంద్ర బాబు మ్యానిఫెస్టో లో ఎప్పుడూ మోసాలు ఉంటాయని చెప్పే జగన్ శనివారం నాడు విడుదల చేసిన వైసీపీ మ్యానిఫెస్టో లో పెద్ద మోసాలకు తెరలేపారు. ప్రజలను గందరగోళానికి గురి చేసి ..ఈ గందరగోళంలోనే ఓట్ల పెట్టలు నింపుకోవాలని ఎత్తుగడ వేసినట్లు ఆయన మ్యానిఫెస్టో తరచి చూసిన వాళ్లకు ఎవరికైనా అర్ధం అవుతుంది. ఉదాహరణకు వైఎస్ఆర్ చేయూత పధకం కింద 33 .15 లక్షల మందికి తమ కాళ్లపై తాము నిలబడేలా ఇకపై 1 .50 లక్షల రూపాయల వరకు మహిళలకు సాయం అందించనున్నట్లు మ్యానిఫెస్టోలో ప్రకటించారు. కానీ లోపల మాత్రం ప్రతి ఏటా 18750 రూపాయల లెక్కన వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో ఈ సాయం అందిస్తామని రాసుకొచ్చారు. అంటే వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో కూడా మరో 75 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు. కానీ కొత్తగా వైఎస్ఆర్ చేయూత కింద ఇకపై 1 .50 లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు సెపరేట్ హెడ్డింగ్ పెట్టి మరి మోసం చేసే ప్రయత్నం చేశారు.

                                      వైఎస్ఆర్ కాపునేస్తం విషయంలోనూ అదే మోసపు మోడల్ ను ఫాలో అయ్యారు. ఒక్క అమ్మఒడి మాత్రమే 15 వేల రూపాయాల నుంచి 17 వేల రూపాయలకు పెంచారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే గత నాలుగు సంవత్సరాలుగా ఇచ్చిన మొత్తాలను కూడా కొత్త మ్యానిఫెస్టో లో పెట్టి ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లను మోసం చేసేందుకు వైసీపీ పెద్ద స్కెచ్ వేసినట్లు ఈ మ్యానిఫెస్టో చూస్తే అర్ధం అవుతుంది. విచిత్రం ఏమిటి అంటే మ్యానిఫెస్టో లో చెప్పకపోయినా కూడా భోగాపురంలో 4592 కోట్ల రూపాయలతో ఎయిర్ పోర్ట్ నిర్మిస్తున్నట్లు రాసుకొచ్చారు. వాస్తవానికి ఈ ఎయిర్ పోర్ట్ కు అవసరమైన భూసేకరణ ఎక్కువ భాగం, టెండర్ ల ఖరారు కూడా గత చంద్రబాబు ప్రభుత్వంలోనే పూర్తి అయింది. జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ కు భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ అప్పగించటం స్కాం అని ఆరోపించిన జగన్ ...తర్వాత అదే సంస్థకు ప్రాజెక్ట్ అప్పగించి..ఇప్పుడు దాన్ని ఏదో కొత్తగా అంతా తానే చేసినట్లు కలరింగ్ ఇచ్చుకోవటమే విశేషం. కానీ జిల్లాకు ఒక ఎయిర్ పోర్ట్ నిర్మిస్తాను అని గొప్పగా ప్రకటించిన జగన్ ఈ విషయాన్ని మాత్రం తన మ్యానిఫెస్టో లో ఎక్కడా ప్రస్తావించలేదు అంటే అది జరిగే పని కాదు అని అర్ధం అయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామికంగా ఎంతో వెనకబడి ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో సీఎం జగన్ ఒక ప్రమాదకరమైన విషయాన్ని వైసీపీ మ్యానిఫెస్టోలో ప్రస్తావించారు.

                                               అదేంటి అంటే ఇక నుంచి పీపీపీ పద్దతిలో ప్రతి జిల్లాలో పారిశ్రామిక పార్క్ లు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఏపీఐఐసీ నే ఇలాంటి పనులు చేస్తూ వస్తోంది. దీని బదులు పీపీపీ పద్దతిలో పారిశ్రామిక పార్క్ లు అంటే...పారిశ్రామిక వేత్తలపై అధికార భారం పడుతుంది అనటంలో సందేహం లేదు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే వైసీపీ మ్యానిఫెస్టో లో ఎక్కడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి ) సెక్టార్ గురించి ప్రస్తావించినట్లు కనిపించలేదు. ప్రస్తుతం మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ను 3500 రూపాయలకు పెంచుతానని..అది కూడా 2028 లో 250 రూపాయలు...2029 లో మరో 250 రూపాయలు పెంచనున్నట్లు వెల్లడించారు. మరో వైపు రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ ను వచ్చే ఐదేళ్లలో పూర్తి చేసే జాబితాలో చేర్చారు. అంటే జగన్ మళ్ళీ గెలిస్తే తన టర్మ్ పూర్తి అయ్యే వరకు ఈ కీలక ప్రాజెక్ట్ ను పూర్తి చేయకపోయినా ఎవరూ ఏమీ మాట్లాడటానికి ఉండదు అన్న మాట. రాజధాని అంశంపై ఒక వైపు సుప్రీం కోర్ట్ లో కేసు ఉన్నా కూడా 2024 లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖను పరిపాలన రాజధానిగా చేసి రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ గా మారుస్తాం అని ప్రకటించారు. అమరావతి, కర్నూల్ విషయంలో మళ్ళీ అదే పాట అందుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ మ్యానిఫెస్టోలో ఒకటి, రెండు విషయాలు తప్ప ఏ మాత్రం కొత్తదనం లేకపోగా...ప్రజలను ఏమార్చే ప్రయత్నం మాత్రం చేశారు.

Tags:    

Similar News