నిన్న రాజీనామా హంగామా...ఇప్పుడు స్పీకర్ ఫార్మాట్ పాట

Update: 2024-04-27 09:03 GMT

లోక్ సభ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకునేందుకు తెలంగాణాలో ప్రతిపక్ష బిఆర్ఎస్ నానా తంటాలు పడుతోంది. దీనికోసం ఆ పార్టీ అగ్రనేతలు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అందులో బిఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్యే హరీష్ రావు ఒకరు. ఆయన గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ రైతులకు చేస్తానన్న రెండు లక్షల రుణ మాఫీపై తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హరీష్ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే రైతుల రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం అమలు చేయటంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే . అయితే ఇదే బిఆర్ఎస్ 2018 ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని చెప్పి...మొన్నటి ఎన్నికల ముందు వరకు పూర్తి చేయలేదు. ఇప్పటికి ఇంకా రైతులకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి వచ్చి ఇంకా నిండా ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆగం ఆగం అవుతున్న తీరు చూసి పార్టీ నేతలు కూడా ఒకింత అవాక్కు అవుతున్నారు. ఈ హంగామా పార్టీ కి లోక్ సభ ఎన్నికల్లో మేలు చేయటం సంగతేమో కానీ నష్టం చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయనే చర్చ సాగుతోంది.

                                                                 రైతుల రెండు లక్షల రుణ మాఫీని ఆగస్ట్ 15 లోపు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా చెపుతూ వస్తున్నారు. ఇదే విషయంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం నాడు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి రాజీమానా చేస్తున్నట్లు హంగామా చేశారు. ఈ లేఖను కూడా మేధావులకు ఇచ్చి వెళ్లారు. అది కూడా స్పీకర్ ఫార్మాట్ లో లేకుండా సవాలక్ష షరతులతో రాజీనామా అంటూ హంగామా చేశారు. దీనికి అధికార కాంగ్రెస్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. ఒక వైపు శుక్రవారం నాడు రాజీనామా అంటూ హంగామా చేసిన హరీష్ రావు శనివారం మళ్ళీ స్వయంగా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను తాను సిద్ధం చేస్తానని, సీఎం రేవంత్ కూడా రాజీనామా లేఖతో రెడీగా ఉండాలని.. వాటిని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి పంపిద్దామని అన్నారు. శనివారం నాడు హరీష్ రావు చేసిన స్పీకర్ ఫార్మాట్ రాజీనామా వ్యాఖ్యలు చూసిన ఎవరికైనా శుక్రవారం నాడు ఈ మాజీ మంత్రి చేసింది అంతా షో అని ఆయన అంతట..ఆయనే చెప్పినట్లు అయింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

                                       ఆగస్టు 15లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే తన రాజీనామా ఆమోదం పొందుతుందని, హామీలు అమలు కాకపోతే రేవంత్ రాజీనామా చేస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. నిజంగా ఆయన శుక్రవారం నాడు అమరవీరుల స్తూపం వద్ద రాజీనామా లేఖ ఇచ్చి ఉంటే మళ్ళీ ఇప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్ కు రాజీనామా లేఖ పంపాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అన్నది కీలక ప్రశ్న. ఎన్నికల ముందు ఇలా బిఆర్ఎస్ కీలక నేతలు చేస్తున్న ఈ హంగామా అంతా పార్టీ ని మరింత ఇరకాటంలోకి నెడుతుంది అనే చర్చ సాగుతుంది. ప్రతిపక్షంగా బిఆర్ఎస్ హామీలు అమలు చేయమని అధికార పార్టీ ని ప్రశ్నించటం తప్పు కాదు. కానీ పదేళ్లలో బిఆర్ఎస్ విస్మరించిన హామీలను ప్రజలు అంత తొందరగా మర్చిపోతారా అన్నదే ఇప్పుడు కీలకం కానుంది. బిఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఎన్నో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే.

Full View

Tags:    

Similar News