మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగినట్లేనా?!

Update: 2024-04-26 15:43 GMT

Full Viewఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఎందుకంటే ఇక్కడ జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ నుంచి వంగా గీత బరిలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి పరాజయం పాలైన పవన్ కళ్యాణ్ ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలి అనే టార్గెట్ గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం చూస్తే ఈ సారి పవన్ కళ్యాణ్ గెలుపు పెద్ద కష్టం కాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కూడా రంగంలోకి దిగారు. వరుణ్ తేజ్ శనివారం నాడు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలో రోడ్ షో తో పాటు పలు సమావేశాల్లో పాల్గొననున్నారు. వరుణ్ తేజ్ ఎంట్రీ తో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కోసం ఇతర హీరో లు అయిన రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లు కూడా ఎంట్రీ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది.

                                                                   ఇటీవలే పవన్ అన్న, మెగా స్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ కోసం చాలా రోజుల తర్వాత రాజకీయ ప్రకటన చేస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జన సేన, బీజేపీ కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరో వైపు చిరంజీవి జన సేన కోసం ఐదు కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చారు. అదే సమయంలో తన తనయుడు రామ్ చరణ్ కూడా జన సేన కు విరాళం ఇస్తారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇది ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రలో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం టాలీవుడ్ హీరో లు అందరూ తమ కూటమికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మే 13 న ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ తో పాటు లోక్ సభ ఎన్నికలు ఒకే దశలో జరగనున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News