ట్రంప్ పై దావా వేసిన మాజీ డ్రైవర్

Update: 2018-07-10 04:52 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆయన మాజీ డ్రైవర్ దావా వేశారు. కారణం. తాను పనిచేసిన అదనపు గంటలకు గాను ట్రంప్ సంస్థ సరైన వేతనం అందించకపోవటమే అట. ఈ వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ట్రంప్ వ్యక్తిగత డ్రైవర్ ఆయన దగ్గర ఏకంగా 20 సంవత్సరాలపైనే పనిచేశారు. ఆ సమయంలో వేల గంటల అదనపు సమయం పనిచేయాల్సిందిగా ఒత్తిడి చేశారని ఆరోపిస్తున్నాడు. 2016లో ట్రంప్ సీక్రెట్ సర్వీస్ రక్షణలోకి వెళ్ళే వరకూ ఆయన వ్యక్తిగత డ్రైవర్ గా నోయెల్ సింట్రన్ పనిచేశారు. అయితే ఈ డ్రైవర్ వాదనను ట్రంప్ సంస్థ తిప్పికొడుతూ తాము అతగాడికి ఉదారంగా చెల్లింపులు చేశామని చెబుతోంది.

గత ఆరేళ్ల కాలంలో తాను 3300 గంటల అదనపు సమయం పనిచేశానని నోయెల్ ఆరోపిస్తున్నారు. నిర్దేశిత గంటలకు మించి పనిచేయటానికి లేనందున..అదనపు గంటలకు గాను డ్రైవర్ దావా వేయటం తప్పేమీకాదని చెబుతున్నారు. ఓ డ్రైవర్ శ్రమ దోపిడీ చేసి...అతనికి చెల్లించాల్సిన వేతనాలు కూడా సరిగా చెల్లించలేదంటూ ఇప్పుడు ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. అయితే ట్రంప్ సంస్థ మాత్రం తాము కోర్టులో గెలుస్తామని ధీమాతో ఉంది. గంటకు 4.09 అమెరికా డాలర్ల లెక్కన తనకు మొత్తం 1,78,000 డాలర్లు చెల్లించాలని నోయెల్ కోరుతున్నారు. న్యూయార్క్ రాష్ట్రంలోని సుప్రీంకోర్టులో ఈ కేసు దాఖలు అయింది.

 

Similar News