'టీఆర్ఎస్ సర్కారు మొన్న ఓ కలెక్టర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఇప్పుడు మెదక్ కలెక్టర్ ను మంత్రిని చేస్తారేమో. ఆయన నోటికొచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారు. ఆయన ఏ అధికారంతో మీడియా ముందు ఈ విషయాలు ప్రకటిస్తారు. కోర్టుకు నివేదిక సమర్పించటమే ఆయన బాధ్యత. కానీ ఈటెల రాజేందర్ కబ్జా చేశాడు అని ప్రజల్లో అపోహలు కల్పించేందుకే ఈ పని చేశారు. అందుకే కలెక్టర్ పై గ్యారంటీగా కేసు పెడతాం' అని ఈటెల జమున స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ కు చెందిన జమున హ్యాచరీస్ 70 ఎకరాల భూములు కబ్జా చేసిన విషయం నిర్ధారణ అయిందని అంటూ మెదక్ కలెక్టర్ హరీష్ సోమవారం ఉదయం మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చేతనైతే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ..ఇలా తమ వ్యాపారాలను టార్గెట్ చేయటం ఏమిటని ఈటెల జమున మండిపడ్డారు. 'మా వ్యాపారాలకు అనుమతులు ఇవ్వదొద్దని పెద్దలు చెప్పిన్లటు అధికారులే చెప్తున్నారు. చాలా మంది మంత్రుల పౌల్ట్రీ ఫాంలకు పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయా?. ఈటల టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఒకలా.. బయటకొచ్చినాక మరొకలా వ్యవహరిస్తున్నారు. మా భూముల్లో పెద్ద షెడ్డులు వేసుకుంటే తప్పేంటి?.'' అని జమున ప్రశ్నించారు. మహిళా సాధికారిత గురించి మాట్లాడే ముఖ్యమంత్రి తనను మానసికంగా హింసించటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను భవిష్యత్తులో ఎదుర్కోవటానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉండాలన్నారు.
తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నారని జమున ఆరోపించారు. 33 జిల్లాల్లో ఈటల రాజేందర్ పర్యటిస్తారని, ఎదుర్కోవటానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం సొంత భూములను అమ్ముకున్నామని చెప్పారు. తమ గెలుపును ఓర్వలేక ఈటల రాజేందర్‌ను రోడ్డు మీదకు తేవాలని ప్రయత్నిస్తున్నారని జమున మండిపడ్డారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ ప్రస్తుతం ఒక జిల్లా మాత్రమే తిరుగుతున్నారని..ఇక నుంచి మూడు జిల్లాల తిరిగేలా పనులు అన్నీ తానే చూసుకుంటానన్నారు. ప్రభుత్వం తమకు నచ్చితే ఒక రకంగా..నచ్చకపోతే మరొక రకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 111 జీవోకు సంబంధించి ఓ భూమి విషయంలో కూడా తొలుత ప్రైవేట్ భూమి అన్నారని..తర్వాత మాత్రం ప్రభుత్వ భూమి అని మాటమార్చారని తెలిపారు. అంటే ప్రభుత్వంలో ఉన్న వారు ఏది కావాలనుకుంటే అలా చేస్తారా అని ప్రశ్నించారు. కెసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులకు కూడా పౌల్ట్రీ వ్యాపారాలు ఉన్నాయని..ఎవరికీ లేని నిబందనలు తమకు మాత్రమే వర్తిస్తాయన్నట్లు మాట్లాడుతున్నారని..తాము ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని జమున వివరించారు.