అధికార టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం తెలంగాణలో పెద్ద సంచలనం రేపింది. ఈ అంశంపై టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ తోపాటు బిజెపి పార్టీలు కూడా టీఆర్ఎస్ తీరును తప్పుపట్టాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రెండు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రామక్రిష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పిన అంశాలు పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీలు ఎటాక్ ను మరింత పెంచాయి. చేసేదేమీ లేక టీఆర్ఎస్ కూడా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇంత కాలం ఈ వ్యవహారంపై మౌనంగా ఉంటూ వచ్చిన పార్టీ వనమా రాఘవను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసింది.
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్‌ఛార్జి నూకల నరేష్ రెడ్డిలు ఆరోపణలకు గురైన కొత్తగూడెం పార్టీ నాయకులు వనమా రాఘవేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని తెలిపారు. పోలీసులు ఇప్పటివరకూ రాఘవను అరెస్ట్ చేయకపోవటం కూడా తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తాము పోలీసుల విచారణకు సహకరిస్తామని..అప్పటివరకూ పార్టీ కార్యక్రమాలకు కూడా రాఘవను దూరం పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే.