టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ నియమితులైనప్పటి నుంచి వెరైటీ ప్రచారంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఆయన చర్యలు చాలా వరకూ సత్ఫలితాలు కూడా ఇస్తున్నాయి. ఈ తరుణంలో సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో అల్లు అర్జున్ కు టీఎస్ఆర్టీసీ లీగల్ నోటీసులు పంపింది. టీఎస్ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. హీరో అల్లు అర్జున్ తోపాటు రాపిడో సంస్థకు కూడా లీగల్ నోటీస్ లు ఇచ్చారు. నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ...యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం సరికాదని అన్నారు.
ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ పేర్కొన్నారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ టిఎస్ఆర్టిసిని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యం , ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు సహించరన్నారు. వాస్తవానికి మెరుగైన, పరిశుభ్రమైన పర్యావరణ సమాజం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో యాక్టర్స్ నటించాలి. టిఎస్ఆర్టీసి సామాన్యుల సేవలో ఉందని, అందుకే నటునికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు పంపుతున్నాం. అని చెప్పారు.