ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారి గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. అదే సమయంలో తొలిసారి గ్రూప్ 1 ఉద్యోగాల్లో ఆర్ధికంగా వెనకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), స్పోర్ట్స్ రిజర్వేషన్స్ ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి మొత్తం 503 గ్రూప్-1 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారానే అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
మెయిన్స్ లో వచ్చిన ఫలితాల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఆన్‌లైన్ ద్వారానే పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు ఇంటర్వూలు రద్దు చేశారు. 2018లో జారీ అయిన నూతన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా స్థానికులకే 95 శాతం రిజర్వేషన్ దక్కనుంది. మే 2 నుంచి మే 31 వరకూ ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ప్రాథమిక పరీక్ష జులై\ఆగస్టులో, లిఖితపూర్వక పరీక్ష నవంబర్ \డిసెంబర్ 2022లో ఉంటుందని తెలిపారు.