తెలంగాణలో రైతులకు మేలు చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఈ రంగానికి చెందిన నిపుణులు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నారు కానీ..వ్యవసాయ, సాగునీటి శాఖల మధ్య సమన్వయం ఉండటంలేదన్నారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బుధవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో " వరి ధాన్యం కొనుగోలు- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత" పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు నిపుణులు కీలక సూచనలు చేశారు. అందులో ముఖ్యమైనవి..డిమాండ్, సరఫరా ఆధారంగా పంటల విధానాన్ని ప్రభుత్వం నిర్ధారించాలి. ఏ భూముల్లో ఏ పంట బాగా పడుతుందో గుర్తించి అందుకు అనుగుణంగా పంటల మార్పిడిని ప్రోత్సహించాలి. పంట మార్పిడి విధానానికి ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలన్నారు. అప్పుడే రైతులు ఉత్సాహంగా ఈ మార్పుకు అంగీకరిస్తారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాలంటే రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఈ సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జగపతిరావు మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్త ల సలహాలు.. సూచనలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తాము రైతుల తరపున మాట్లాడతామన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన పంటల ప్రణాళిక మంచిది కాదని గతంలోనే సీఎం కు చెప్పానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు.. వడ్లు పండించేందుకే కట్టారన్నారు. రెండేళ్ల కిందటే తెలంగాణ వ్యవసాయం వరి వైపు వెళ్తుందని హెచ్చరించాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు నింపడమే.. డిస్ట్రిబ్యూషన్ సిస్టం లేదన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త రవీంద్ర బాబు మాట్లాడుతూ నీటితో మాగాణి కాదు.. నేల రకాలను బట్టి ఉంటుందన్నారు. క్రాప్ డైవర్సీటీ విధానం ఉండాలి. అమలు చేయలేక పోతున్నారు. అగ్రికల్చర్ స్టేట్ పాలసీ.. కేంద్రానికి సంబంధం లేదన్నారు. ఎగుమతులపై మార్కెటింగ్ ప్లానింగ్ ఉండాలన్నారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ అన్ని మంచిగనే ఉన్నయి.. అల్లుడు నోట్లో శని అన్నట్లు ఉంది తెలంగాణ పరిస్థితి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంతో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు చాలా అనుమానాలు ఉన్నాయి. వరి.. పత్తి కిందనే చాలా భూమి ఉంది. రైతులకు ఇవే ప్రధాన పంటలు అయ్యాయన్నారు. తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు ఎప్పటి నుంచో వేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. రైతు ఏ రైస్ పెట్టినా కొనాలి. ఎగుమతి.. దిగుమతులపై కేంద్రం మార్గం చూపాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. కోటగోడలు దాటను.. ఎవరితోను మాట్లాడను.. అన్ని నాకే తెలుసు అనే ధోరణి సీఎం కేసీఆర్ వీడాలె.రైతులకు అన్యాయం జరిగితే... రాష్ట్ర ప్రభుత్వానిదే పాపం అవుతుందని విమర్శించారు. రిటైర్డ్ ఇంజినీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఏ పంటల కోసం అనేది ప్రాజెక్టులను డిజైన్ చేయలేదన్నారు. కాళేశ్వరం కూడా ఐడీ క్రాప్స్ డిజైన్ చేయలేదు. అగ్రికల్చర్.. ఇరిగేషన్ శాఖల మధ్య సంబంధమే లేదు. వైఎస్ హయాంలో జీవో 33 ప్రకారం స్పింక్లర్ పంటలకు పర్మిషన్ ఇచ్చారు. ప్రభుత్వాలు రైతులతో చర్చించాలి. ఇప్పుడు రైతులు వరి కుప్పల మీదనే ఉరి వేసుకుంటున్నారు.తెలంగాణ లో అన్ని పార్టీలు.. సంఘాలు రైతులతో చర్చించాలి. రాష్ట్రంలో 30 లక్షల బోర్ల కింద 50 లక్షల ఎకరాల వరి సాగు అవుతుందన్నారు. కాంగ్రెస్ నేత అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక కోటి ఎకరాల మాగాణం అని ప్రభుత్వం చెప్పింది.మాగాణం అంటేనే వరి పంట వేసేందుకు అనుకూలంగా ఉంటుంది. రైతు పండించిన వరి పంటకు బాయిల్.. రా రైస్ లతో సంబంధం లేదు. కొనుగోలు చేశాక ఏం చేసుకోవాలో ప్రభుత్వాల ఇష్టం. ప్రత్యామ్నాయ పంటలు వేస్తే గిట్టుబాటు ధర కల్పించాలి. వరి వద్దనమంటే రైతులను నిర్వీర్యం చేయడమే అవుతుంది. వరిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. రైతులపై స్పష్టమైన వైఖరి తో వెళ్లాలన్నారు. టీఆర్ఎస్ నేత బచ్చు శ్రీనివాస్ మాట్లాడుతూ వరి పై రాజకీయ కోణంలో కాకుండా రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 5 వేల ఎకరాలకు క్లస్టర్ తో అధికారిని నియమించింది.
భవిష్యత్ ఆలోచన తో ముందుకెళ్తోంది. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది. రైతు వేదికలను ఏర్పాటు చేసి రైతు సుభిక్షంగా ఉండాలని కృషి చేస్తున్నారు సీఎం కేసీఆర్. కేంద్రం వరిపై అస్పష్టమైన వైఖరి అవలంభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ముందుకెళ్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఆరుతడి పంటలకే కాళేశ్వరం డిజైన్ చేసింది. మరి కోటి ఎకరాల మాగాణం ఎందుకొచ్చిందో తెలియాలె. యాసంగి వడ్లను కేంద్రం కొంటుంది. రా రైస్ యాసంగిలో కొంటాం.. ఎంత అవసరమో.. ఉత్పత్తిని బట్టి తీసుకుంటాం అని కేంద్రం చెప్పింది. బాయిల్ రైస్ కొనమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ప్రత్యామ్నాయ పంటల వైపు తెలంగాణ ప్రభుత్వం రైతుల ను మళ్లించకుండా నట్టేట ముంచుతుంది. కోటీ 20 లక్షల ఎకరాల యోగ్యమైన భూమి ఉండగా.. వరి..పత్తినే ఎక్కువగా వేశారు. పీడీఎస్ బియ్యం రీ సైక్లింగ్ చేసి ఎఫ్ సీఐ కి అమ్ముతుండగా.. అవినీతి జరుగుతోంది. పీడీఎస్ అక్రమ రవాణను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం లేదన్నారు.