పెట్టుబడి వందల కోట్లు..ప్రయోజనం వేల కోట్లు

Update: 2024-12-19 05:40 GMT

సుల్తాన్ పూర్ లో సాగుతున్న దందా

ఒక మంత్రి పెట్టుబడి. మరో మంత్రి సహకారం. ఇంకో కాంగ్రెస్ కీలక నేత అండదండలు. హైదరాబాద్ కు అత్యంత చేరువగా ఉండే పటాన్‌చెరు సమీపంలోని సుల్తాన్ పూర్ లో సాగుతున్న వేల కోట్ల రూపాయల భూదందా ఇది . వీళ్ళు ముగ్గురూ కలిసి ఏకంగా ఏడు వందల ఎకరాల భూమి కోసం బిగ్ స్కెచ్ వేశారు. సర్వే నెంబర్ 30 లో మొత్తం 722 ఎకరాలు ఉంది. ఇందులో 242 ఎకరాల్లో రైతులు సాగుచేసుకుంటున్నారు. మిగిలిన భూమి అంతా పడావుగా ఉంది. ఇందులో ఎక్కువ మొత్తం అసైన్ మెంట్ భూమే కావటం విశేషం. ఈ భూమిపై కన్నేసిన తెలంగాణ క్యాబినెట్ లోని కీలక మంత్రి ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. దీనికి అవసరం అయిన పెట్టుబడి మొత్తం ఆ కీలక మంత్రి తనయుడు చూసుకుంటున్నారు. దీనికి మరో మంత్రి పూర్తి స్థాయిలో తన వంతు సహకారం అందిస్తుండగా ...మరో కాంగ్రెస్ కీలక నేత కూడా ఈ భూ దోపిడీ దందాకు తన వంతు సాయం చేసి ...తన వాటా తాను తీసుకోవటానికి ఓకే చెప్పేశారు అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ ప్రాంతంలో ఎకరా ధర తక్కువలో తక్కువగా ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు ఉంటుంది అని అంచనా. అయితే అసైన్ మెంట్ హక్కుదారులకు కేవలం పది నుంచి ఇరవై లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే మార్కెట్ ధర ప్రకారం ఇద్దరు మంత్రులు...ఒక కీలక నేత కలిసి కారు చౌకగా దక్కించుకోనున్న భూమి విలువ తక్కువలో తక్కువ 4200 కోట్ల రూపాయలు ఉంటుంది అని చెపుతున్నారు. అంటే వందల కోట్ల రూపాయల పెట్టుబడితో పేదల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి కొట్టేయటానికి అధికారాన్ని అడ్డంపెట్టుకుని స్కెచ్ వేశారు. ఇప్పటికే ఈ భూమికి సంబంధించి అసైన్ మెంట్ లబ్ధిదారులతో శరవేగంగా ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇద్దరు మంత్రులు ఈ భారీ బిగ్ ల్యాండ్ డీల్ కథ నడిపిస్తున్నారు. ముందు చేతిలోకి వందల ఎకరాలు వచ్చిన తర్వాత అసలు స్కెచ్ ప్రారంభం అవుతుంది అని చెపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో గత జగన్ మోహన్ రెడ్డి సర్కారు అసైన్ మెంట్ భూములపై హక్కుదారులకు అమ్ముకునే వెసులుబాటు కలిపించింది.

అయితే దీనికంటే ముందే పెద్ద ఎత్తున వైసీపీ నేతలే రాష్ట్రం అంతటా కూడా వేల ఎకరాలు కొనుగోలు చేశారు. పైకి మాత్రం పేదలకు మేలు చేయటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపుతారు కానీ..అసలు ఎజెండా మాత్రం అధికారంలో ఉన్న పెద్దలు లాభపడటం కోసమే అన్న విషయం తర్వాత కానీ తేలదు. ఇప్పుడు ఈ ఇద్దరు తెలంగాణ మంత్రుల ప్లాన్ చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ లో కూడా జగన్ మోడల్ ఫాలో అయ్యే అవకాశం ఉంది అని చెపుతున్నారు. మొత్తానికి ఈ మంత్రుల భూ దందా అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతానికి పైకి ఇద్దరు మంత్రుల పేరు మాత్రమే వినిపిస్తున్న దీని వెనక ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. నిజంగా ప్రభుత్వ పెద్దలకు దీంతో ఏ మాత్రం సంబంధం లేకపోతే మంత్రుల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. 

Similar News