రాజమౌళి కంటే పోలీస్ లే బాగా కథలు చెపుతున్నారు

Update: 2025-01-06 05:31 GMT

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ఏసీబీ ఆఫీస్ ముందు కొద్ది సేపు హంగామా చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసు కు సంబంధించి విచారణ కోసం ఏసీబీ ఇటీవల కేటీఆర్ కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆయన విచారణ కోసం ఏసీబీ ఆఫీస్ కు వచ్చారు. అయితే అక్కడ పోలీస్ లు కేటీఆర్ ను మాత్రమే తాము విచారణకు అనుమతిస్తామని ..లాయర్లకు అనుమతి లేదు అని తెలిపారు. అయితే కేటీఆర్ మాత్రం పోలీస్ అధికారులతో వాదనకు దిగి తాను లాయర్లతో అయితేనే విచారణకు హాజరు అవుతాను అని..లేకపోతే లేదు అని స్పష్టం చేశారు. లాయర్లను అనుమతించకపోతే లిఖితపూర్వకంగా ఆ విషయం తనకు ఇవ్వాలన్నారు. విచారణలో భాగంగా తన పక్కన లాయర్ లు ఉంటే నష్టం ఏంటి అని కేటీఆర్ ప్రశ్నించారు. లగచర్ల ఇష్యూ లో పోలీస్ లు పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్ మెంట్ ఇచ్చినట్లు రాసుకుని..మీడియా కు లీకులు ఇచ్చారు అని...అందుకే తాను లాయర్లతో వచ్చినట్లు చెప్పారు.

                                           పోలీసులు ఎస్ ఎస్ రాజమౌళి కంటే గొప్ప గొప్ప కథలు రాస్తున్నారు, సినిమాలు చూపిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు రిజర్వు చేసినప్పుడు అసలు తనను ఎందుకు పిలవాలి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు అని..అందుకే విచారణకు వచ్చినట్లు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రైతు భోరోసా విషయాన్ని పక్క దారి పట్టించేందుకు ఈ డ్రామా చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ హై కోర్టు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు అనంతరం తీర్పును రిజర్వు చేసింది. అప్పటి వరకు అరెస్ట్ కూడా చేయవద్దు అని ఆదేశించింది. అయితే ఏసీబీ ఈ కేసు విషయంలో విచారణ చేయవచ్చు అని స్పష్టం చేసింది. అందులో భాగంగానే కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసు లు జారీ చేయగా..ఇప్పుడు ఆయన తనకు తాను సర్టిఫికెట్స్ ఇచ్చుకుంటూ లాయర్లు ఉంటేనే విచారణకు హాజరు అవుతాను అని చెప్పారు.

                                                        ఇందుకు అధికారులు నో చెప్పటంతో కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. అయితే విచారణ సమయంలో తాను చెప్పాలనుకున్న విషయాలను స్టేట్ మెంట్ అధికారులకు అందచేశారు. ప్రభుత్వం వద్దే అన్ని రికార్డులు ఉన్నాయి అని...అసలు తనను ఏమి విచారిస్తారో అర్ధం కావటం లేదు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారులు తన ఇంటిపై దాడి చేసి వాళ్ళే కొన్ని పేపర్లు పెట్టి ఏదో చేయాలనీ రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు అని..వీటి అన్నిటిని చట్టపరంగానే ఎదుర్కొంటామని పేర్కొన్నారు.

Tags:    

Similar News