బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వరస కేసు లు నమోదు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఏసీబీ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో కేసు నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసు లో కేటీఆర్ ఏ 1 గా ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ ఫార్ములా కేసు విషయంలో విచారణకు అనుమతి మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీ వేగం పెంచింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే హెచ్ ఎం డీఏ ఈ రేస్ నిర్వహణకు ఒప్పందం చేసుకోవటం, ఆర్ బిఐ అనుమతి లేకుండా 48 కోట్ల రూపాయలను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించటం వంటి అంశాలపై కేసు నమోదు అయింది. అది కూడా ఎన్నికల కోడ్ అమలు లో ఉన్న సమయంలో ఈ చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు లో కేటీఆర్ ఏ 1 గా ఉండటంతో ఆయన అరెస్ట్ తప్పదు అనే ప్రచారం జరుగుతోంది.
కొద్ది రోజుల క్రితం కేటీఆర్ ఇదే విషయంపై స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదు అని..ఈ కేసు లో ప్రభుత్వం తనను అరెస్ట్ చేస్తే జైలు లో యోగా చేస్తా...తర్వాత పాదయాత్ర చేస్తా అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏసీబీ కేసు నమోదు చేయటంతో ఇప్పుడు అందరూ కేటీఆర్ యోగా చేసుకునే సమయం వచ్చినట్లు ఉంది అనే వ్యాఖ్యానిస్తున్నారు. మరో వైపు గురువారం నాడు కేటీఆర్ అసెంబ్లీ లో మాట్లాడుతూ ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంపై అసెంబ్లీ లో చర్చించాలని డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఓఆర్ఆర్ లీజ్ పై సిట్ తో విచారణ జరిపించనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబదించిన విధివిధానాలను క్యాబినెట్ లో చర్చించి ఖరారు చేస్తామని అన్నారు. ఇది కూడా కేటీఆర్ నిర్వహించిన మున్సిపల్ శాఖకు సంబదించిన విషయమే అన్న సంగతి తెలిసిందే.
అడ్డగోలుగా ఎన్నికల ముందు ఓఆర్ఆర్ ను ఏకంగా 30 సంవత్సరాలకు లీజ్ కు ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో పాటు నూతన సచివాలయంలో జరిగిన ఐటి కొనుగోళ్ల వ్యవహారం లో కూడా అక్రమాలు జరిగాయి అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రాబోయే రోజుల్లో దీనిపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది అని చెపుతున్నారు. అదే జరిగితే కేటీఆర్ పై మరో ఐఏఎస్ అధికారి జయేష్ రంజాన్ కూడా చిక్కుల్లో పడటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రేవంత్ రెడ్డి సర్కారు ఇదే దూకుడు చూపిస్తే కేటీఆర్ పై పెద్ద ఎత్తున కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది.