గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు మరో షాక్. తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి బిజెపిలో చేరనున్నారు. మంగళవారం నాడు ఆమె ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరతారని బిజెపి నేతలు చెబుతున్నారు. విజయశాంతి గతంలో కూడా కొంత కాలం బిజెపిలో కొనసాగారు. ఆమె గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు తప్ప..రాజకీయంగా..ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోవటం లేదు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ స్వయంగా విజయశాంతి నివాసానికి వెళ్లి మరీ చర్చలు జరిపి వచ్చారు.
ఆమె పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ చర్చలు సాగాయి. అంతకు ముందు తెలంగాణకు చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా విజయశాంతితో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇదే నిజం అవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి చెప్పుకోదగ్గ సీట్లు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి మరికొంత మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన విజయశాంతి 2000 సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.