తెలంగాణ లో బలంగా వీస్తున్న మార్పు గాలులు

Update: 2023-11-23 13:38 GMT

Full Viewసహజంగా చాలా మంది కారును పదేళ్లకు ఒకసారి..లక్ష కిలోమీటర్లు దాటిన తర్వాత మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే తెలంగాణాలో కూడా రాజకీయ మార్పుతథ్యం అనేలా స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఓటర్ల మదిలో ఉన్న ప్రధాన ఆలోచన రెండు సార్లు బిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చాం. ఈ సారి కాంగ్రెస్ కు అవకాశం ఇద్దాం అనే మూడ్ లోకి వచ్చినట్లు క్షేత్ర స్థాయి పరిస్థితులు తేల్చిచెపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇప్పుడు రాష్ట్రంలో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ నే భావిస్తున్నారు. దీనికి తోడు ఆ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు కూడా ప్రజల్లోకి బలంగానే వెళ్లాయి. కారణాలు ఏమైనా ఈ సారి ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర నుంచి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు పదే పదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కటిక చీకట్లు వస్తాయని..రైతులకు మూడు గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తారని ప్రచారం చేస్తున్నా ప్రజలు..ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకునే సూచనలు కనిపించటం లేదు. ఎందుకంటే చాలా మంది ప్రజలు ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఈ సారి ఒక ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. కెసిఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా ధరణి అంశం కూడా అధికార బిఆర్ఎస్ కు పెద్ద మైనస్ గా మారబోతున్నట్లు చెపుతున్నారు. ఎవరు ఏమి చేస్తున్నారో ఏ మాత్రం పట్టించుకునే అవకాశం లేని హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో జరిగిన భూ మోసాల గురించి ప్రజలకు పెద్దగా తెలిసే అవకాశం లేదు..కానీ జిల్లాల్లో ఎమ్మెల్యేలు...వారి అనుచరులు చేసిన వ్యవహారాలు దాచినా ఏ మాత్రం దాగవు. ధరణి పేరుతో చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వ్యవహారాలు బహిర్గతం అయ్యాయని చెపుతున్నారు.

                                         దీంతో పాటు వరసగా మూడవసారి ఎమ్మెల్యేలను మార్చకుండా కెసిఆర్ చేసిన ప్రయోగం పెద్ద ఎత్తున బిఆర్ఎస్ ను దెబ్బ కొట్టబోతున్నట్లు కనిపిస్తోంది. వీటితో పాటు ఏ పథకాలు గురించి అయితే కెసిఆర్ గొప్పగా చెప్పుకుంటున్నారో... తాను తప్ప దేశంలో వీటి గురించి ఆలోచించింది ఎవరూ లేరు అని ప్రకటించుకుంటున్నారో వాటి అమలు అంతంత మాత్రం ఉండటం కూడా బిఆర్ఎస్ ను ముంచబోతున్న అంశంగా పార్టీ నాయకులు కూడా చెపుతున్నారు. ముఖ్యంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళిత బంధు వంటి స్కీములు బిఆర్ఎస్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని ప్రచారంలో ఉన్న ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాలే కాకుండా బిఆర్ఎస్ కు మంచి పట్టు ఉన్న జిల్లాలు అయిన కరీంనగర్, వరంగల్, నిజామాబాదు, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో కూడా కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో బోరు కొచ్చిన కారు ను ఇంటికి పంపటానికే ప్రజలు సిద్ధం అయినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీ తో గెలిచినా కూడా ఆ క్రెడిట్ లో అరవై శాతం వరకు బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ కే ఇవ్వాల్సి ఉంటుంది అని ..కాంగ్రెస్ కృషి నలభై శాతం మాత్రమే లెక్కించాల్సి ఉంటుంది అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. వారం రోజుల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మార్పు గాలి చాలా చాలా స్పష్టంగా ఉంది అని తేలిపోతోంది. ఈ లెక్కన డిసెంబర్ మూడున వెలువడే ఫలితాల్లో ఇంకెన్ని సంచలన అంశాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాల్సిందే. మరో కీలకమైన విషయం ఏమిటి అంటే కెసిఆర్ క్యాబినెట్ లోని కీలక మంత్రులు ఇంటి బాట పెట్టబోతున్నారు. హెలికాప్టర్ లో కెసిఆర్ ఎంత స్పీడ్ గా తిరుగుతున్నా కింద మాత్రం కారు పెద్దగా కదలటం లేదు అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. 

Tags:    

Similar News