ప్రభుత్వ బలహీనతా..రాజకీయ అనివార్యతా?!

Update: 2024-09-19 12:37 GMT

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాత్రమే అధికారిక పర్యటనలకు హెలికాప్టర్ లు వాడేవాళ్లు. వరదలు..లేదా ఇతర విపత్తుల సమయంలో మాత్రం మినహాయింపులు ఉండేవి. అప్పటిలో సీఎం లు కూడా ఎక్కువ శాతం ఢిల్లీ పర్యటనలకు కూడా రెగ్యులర్ విమానాల్లోనే ప్రయాణించేవాళ్ళు. కానీ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ నేతలు అంతా ‘స్పెషల్ ’ అయిపోయారు. అందరూ స్పెషల్ ఫ్లైట్స్ కు అలవాటు పడిపోయారు. అది తమ హక్కు అన్న చందంగా వ్యవరిస్తూపోయారు. తెలంగాణాలో కెసిఆర్...ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబులు ఇదే మోడల్ ఫాలో అయ్యారు. తర్వాత వచ్చిన జగన్ కూడా దాన్ని మరింత బాగా అమలు చేశారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇక తెలంగాణ విషయానికి వస్తే బిఆర్ఎస్ హయాంలో కెసిఆర్ తో పాటు పలు సందర్భాల్లో అప్పటి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు కూడా హెలికాప్టర్ లు వాడిన సందర్భాలు ఉన్నాయి. మంత్రులు మాత్రమే కాదు...అప్పటిలో కెసిఆర్ జమానాలో ఒక వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పర్యటనలకు కూడా కెసిఆర్ ప్రభుత్వం హెలికాప్టర్ లు సమకూర్చింది.

                                                                           బహుశా దేశంలో అధికారుల సమీక్షకు ప్రభుత్వం హెలికాప్టర్ లు సమకూర్చింది కెసిఆర్ జమానాలోనే అయి ఉండొచ్చు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విచిత్రం ఏమిటి అంటే అప్పటి గవర్నర్ తమిళ్ సై కి మాత్రం హెలికాప్టర్ నో చెప్పిన సందర్భాలు ఎన్నో. గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనను..ముఖ్యంగా కెసిఆర్ మోడల్ పై తీవ్ర విమర్శలు చేసే తెలంగాణ మంత్రులు కూడా ఇప్పుడు మాట్లాడితే హెలికాప్టర్ ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. పోనీ అదేదో దూరం లో ఉండే ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు..అత్యవసర పనులకు వీటిని వాడుతున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ కేవలం రెండు గంటల్లో పర్యటించే వీలు ఉన్న నల్గొండ జిల్లా పర్యటనకు కూడా మంత్రులు హెలికాప్టర్ లో వెళ్లాల్సిన అవసరం ఉందా అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దగ్గర నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి వంటి వాళ్ళు అంతా ఇదే మోడల్ ఫాలో అవుతున్నారు.

                                                                              ఒక పక్క తెలంగాణ ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది అని చెపుతూ హైదరాబాద్ పక్కనే ఉన్న జిల్లాలకు కూడా ఇలా హెలికాప్టర్ పర్యటనలు చేయటం అవసరమా అన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. పోనీ ప్రభుత్వం దగ్గర ఏమైనా హెలికాప్టర్ ఉంది దాన్ని వాడుతున్నారు అంటే కొంతలో కొంత అర్ధం చేసుకోవచ్చు. కానీ సీఎం పర్యటనతో సహా ఏ పర్యటన కోసం అయినా అద్దెకు తెచ్చుకుని గాలిలోకి ఎగరాల్సిందే. ఇలా మంత్రులకు కూడా అడిగిందే తడవుగా హెలికాప్టర్ లు సమకూర్చటం ప్రభుత్వ బలహీనతా...లేక రాజకీయ అనివార్యతా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాము కోరుకున్న సీఎం పదవి దక్కలేదు...కనీసం హెలికాప్టర్ పర్యటనలకు కూడా అనుమతి ఇవ్వరా అన్న చందంగా మంత్రులు వ్యవహరిస్తున్నారా అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు ఆర్థిక కష్టాల్లో ఉన్నామని చెపుతూ..అవసరం లేని చోట కూడా హెలికాప్టర్ లు వాడటం అన్నది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే అంశమే. శుక్రవారం నాడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు నల్గొండ పర్యటనకు హెలికాప్టర్ లో వెళ్లనున్నారు.

Tags:    

Similar News