లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చి ఏడు నెలలు అయినా నో యాక్షన్ !
ఇప్పుడు కెసిఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
ఇందులో అయినా వాస్తవాలు వెలుగులోకి వస్తాయా.. చర్యలు ఉంటాయా!
బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తీరు ఎలా ఉంటుంది అంటే ప్రపంచంలో ఎవరినైనా తాను ప్రశ్నించవచ్చు. కానీ తనను మాత్రం ఎవరూ..ఏ అంశంపై కూడా ప్రశ్నించకూడదు అన్నట్లు ఉంటారు ఆయన. అధికారంలో ఉన్నంత కాలం అలాగే వ్యవహరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చోటు చేసుకున్న అక్రమాలను నిగ్గుతేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీ సి ఘోష్ కమిషన్ తాజాగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు నోటీసు లు జారీ చేసింది. ఒక్క కెసిఆర్ కు మాత్రమే కాకుండా మాజీ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు కూడా నోటీసు లు జారీ అయ్యాయి. జూన్ 5 న తమ ముందు హాజరు కావాలని కెసిఆర్ కు , హరీష్ రావు కు జూన్ ఆరవ తేదీ, ఈటల రాజేందర్ కు జూన్ తొమ్మిదవ తేదీ కేటాయించారు. అయితే ఈ నోటీసు ల విషయంలో మాజీ సీఎం కెసిఆర్ ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గతంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్ట్ ల్లో చోటు చేసుకున్న అవకతవకలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిషన్ కెసిఆర్ కు నోటీసు లు ఇవ్వగా ఆయన వీటిని న్యాయస్థానాల్లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత కెసిఆర్ ను ప్రశ్నించకుండానే ప్రభుత్వ నివేదికలు..అప్పటిలో పని చేసిన అధికారుల ను విచారించి లోకూర్ కమిషన్ తన నివేదికను గత ఏడాది అక్టోబర్ 28 న సమర్పించింది. తొలుత ఈ కమిషన్ కు రిటైర్డ్ జడ్జి ఎల్ నరసింహ రెడ్డి ని వేయగా..ఆయన వివాదంలో చిక్కుకుని మధ్యలోనే తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత జస్టిస్ లోకూర్ బాధ్యతలు చేపట్టి తుది నివేదికను సమర్పించారు. ఇందులో ప్రధానంగా ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన గోల్ మాల్ వ్యవహారాలు తేల్చేందుకు ఈ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవే అంశాలపై ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల మేర నష్టానికి కారణం అయ్యారు అంటూ అప్పటిలో కెసిఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇప్పుడు లోకూర్ కమిషన్ తన నివేదికను సమర్పించి ఏడు నెలలు కావస్తున్నా అసలు ఈ నివేదిక ఒకటి ప్రభుత్వంలో ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయినట్లు రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నివేదిక ప్రభుత్వం చేతికి చేరగానే దీనిపై క్యాబినెట్ లో చర్చించి..అసెంబ్లీ లో పెట్టి కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు కూడా మీడియా కు లీకులు ఇచ్చారు. కొంత మంది మంత్రులు అయితే దీనిపై బహిరంగంగానే ప్రకటనలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ నివేదిక బహిర్గతం కాలేదు..దీనిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతోనే సర్కారు తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కూడా మాజీ సీఎం కెసిఆర్ తో పాటు, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లకు నోటీసు లు జారీ కావటంతో ఇప్పుడు విద్యుత్ రిపోర్ట్ అంశంపై చర్చ తెర మీదకు వచ్చింది.
కాళేశ్వరం విచారణ పరిధి నుంచి కూడా కీలక అంశాలను తప్పించారు అనే విమర్శలు ఉన్నాయి. కొంత మంది బడా బడా కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అని అధికార వర్గాలు కూడా చెపుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ డొల్లతనం మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల్లోనే బయటపడింది. అయినా సరే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వంలో ఇందుకు కారణం అయిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే బిఆర్ఎస్ స్కాం లే రేవంత్ రెడ్డి సర్కారు కు పెద్ద సవాల్ గా మారే అవకాశం లేకపోలేదు అనే చర్చ సాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని లోపాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ( ఎన్ డీఎస్ఏ ) నివేదిక కూడా బహిర్గతం చేసింది. ఇప్పటికే పీ సి ఘోష్ కమిషన్ గత ప్రభుత్వంలో సాగునీటి శాఖలో పని చేసిన ఉన్నతాధికారులు...ఈ ఎన్ సి లు..సిఈ లతో పాటు అన్ని విభాగాల అధికారులతో మాట్లాడి నివేదిక సిద్ధం చేసింది. ఇప్పుడు కెసిఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లను కూడా విచారించి తన తుది నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది.