కృష్ణ ఎల్లాతో తెలంగాణ సీఎస్ భేటీ
పెరుగుతున్న కరోనా కేసులతో రాష్ట్రాలు అన్నీ వ్యాక్సినేషన్ వేగం పెంచాలని నిర్ణయించాయి. మే 1 నుంచి 18 సంవత్సరాల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వటానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం నాడు భారత్ బయోటెక్ సీఎండీ క్రిష్ణా ఎల్లా తో బీఆర్ కె భవన్ లో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోవిడ్-19 వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించాలని నిర్ణయించారని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలందరికి వ్యాక్సినేషన్ చేపట్టటానికి తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక డోసులను సరఫరా చేయాలని ప్రాధాన్యత ఇవ్వాలని సీఎండీని కోరారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక వ్యాక్సిన్ లు ఇవ్వటానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, భారత్ బయోటెక్ డైరెక్టర్ డా. సాయి ప్రసాద్ లు పాల్గొన్నారు.