తెలంగాణలో రాజకీయం కొత్త మలుపు తిరుగుతోంది. సర్కారు వర్సెస్ గవర్నర్ విభేదాలు తీవ్ర స్థాయికి చేరినట్లు కన్పిస్తున్నాయి. సంప్రదాయం ప్రకారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించటం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి అందుకు భిన్నంగా తెలంగాణ సర్కారు ముందుకు వెళ్ళాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సారి గవర్నర్ ప్రసంగాన్ని స్కిప్ చేయటానికి గతంలో జరిగిన కొన్ని సమావేశాలను ఉదాహరణగా తెరపైకి తెచ్చినట్లు సమాచారం. మార్చి 7 నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఈ బడ్జెట్ సమావేశాలు 12 రోజులు జరిగే అవకాశముంది. యాదాద్రి ఆలయ పునః ప్రారంభోత్సవం లోపలే బడ్జెట్ సమావేశాలు పూర్తి కానున్నాయి. మార్చి 28న యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ ఉంటుందని సమాచారం. ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు బడ్జెట్ సమావేశ తేదీలను ఖరారు చేయటానికి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో ఈ సమావేశాల తేదీలపై నిర్ణయం తీసుకున్నారు.