రాజ్ భ‌వ‌న్ ను గౌర‌వించ‌ని వారు ప్ర‌జ‌ల‌ను గౌర‌విస్తారా?

Update: 2022-06-10 10:53 GMT

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా మారారు. ఆమె శుక్ర‌వారం నాడు రాజ్ భ‌వ‌న్ లో ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించ‌ట‌మే కాకుండా..ఆ స‌మావేశంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జాద‌ర్బార్ లో తొలి అడుగుగా 'మహిళా దర్బార్‌' లో మ‌హిళ‌ల నుంచి విన‌తిప‌త్రాలు స్వీక‌రించారు. మహిళా దర్భార్‌లో గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని.. రాజ్భవన్ను గౌరవించాలన్నారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే మన బాధ్యత అని చెప్పారు. రాజ్భవన్నే గౌరవించకుంటే.. సామాన్యుల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణలో మహిళపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదని తప్పుబట్టారు. ప్రభుత్వానికి బాధ్యత లేదా? అని తమిళిసై ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఇటీవల వరుస అత్యాచార ఘటనలు జరిగిన నేపథ్యంలో మహిళల సమస్యలు వినాలని గవర్నర్‌ తమిళిసై నిర్ణయించారు. మహిళల కోసమే ప్రత్యేకంగా దర్బార్‌ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరగడం సంచలనాత్మకంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సరిగ్గా స్పందించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కొన్ని రోజులుగా మహిళా, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. త‌న‌పై చేసే విమ‌ర్శ‌ల‌ను తాను ప‌ట్టించుకోన‌ని..తెలంగాణ ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తూ ముందుకు సాగుతాన‌న్నారు. ఏ భ‌వ‌నం అయినా ఉన్న‌ది ప్ర‌జ‌ల కోస‌మే అన్నారు.

Tags:    

Similar News