తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'నగరం నడిబొడ్డున రూ.2000 కోట్ల దోపిడీ వెనుక ఉన్న ముఠానాయకుడు ఎవరు? . మున్సిపల్ మంత్రి కెటీఆర్ కు తెలియకుండా ఈ దోపిడీ సాధ్యమా?. తెలంగాణ సీఎంవో ఆదేశాలు లేకుండా సీఎస్, మున్సిపల్ కమిషనర్ లు ఇంతలా బరితెగించగలరా?. సర్వే నెంబర్ 327 లో లే ఔట్ అనుమతులు రద్దు చేయాలి.ప్రభుత్వ భూమిని కాపాడాలి.' అని డిమాండ్ చేశారు.
తొలుత దీనికి సంబంధించిన వార్తను ప్రముఖ ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ ప్రచురించింది. ఇదే వార్తను ఆంధ్రజ్యోతి ఆదివారం నాడు ప్రచురించింది. నగరంలో అత్యంత విలువైన భూమిని కొంత మంది అధికారులు ప్రైవేట్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆంగ్ల పత్రికలో వార్త వచ్చి 24 గంటలు దాటినా కూడా ప్రభుత్వం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా నోరుతెరవటం లేదు. చిన్న చిన్న విషయాలపై స్పందించి మైలేజ్ కోసం ప్రయత్నించే వారు ఈ విషయంలో మౌనంగా ఉంటున్నారంటే దీని వెనక పెద్దల హస్తం ఉందనే విషయం స్పష్టం అవుతోందని అధికార వర్గాలు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం తెలంగాణ ఐఏఎస్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.