కెసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించారు
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ గతానికి భిన్నంగా ఈ సారి ముందుకెళుతోంది. అందులో భాగంగానే ఎన్నికలకు చాలా ముందుగానే అత్యంత కీలకమైన రైతు డిక్లరేషన్ ప్రకటించటం ద్వారా అందరి కంటే ఒక అడుగు ముందుకేసింది. ఇప్పుడు ఈ డిక్లరేషన్ అంశాలను ప్రజల్లోకి ..ముఖ్యంగా రైతుల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. రైతు డిక్లరేషన్ అంశంపై బుధవారం నాడు హైదరాబాద్ లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలను వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి 30 రోజుల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. రైతుబంధు పథకాన్ని అర్హులకు మాత్రమే వర్తింపచేస్తామని...సంపన్నులకు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
మొదటి ప్రాధాన్యత గా రైతు డిక్లరేషన్ తీసుకున్నామని, రానున్న రోజుల్లో వైద్యం, విద్య, నిరుద్యోగతపై డిక్లరేషన్స్ కూడా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కెసీఆర్ తీరుపై విమర్శలు చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కెసీఆర్ దివాళా తీయించారన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినవే అని తెలిపారు. 65 సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వాలు కలిపి 69 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే కెసీఆర్ ఏడు సంవత్సరాల్లో చేసిన అప్పుడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అని విమర్శించారు. 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారన్నారు. శ్రీలంకతో పోటీ పడే పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. సీఎం కెసీఆర్ దించటంతోనే దరణి పోర్టల్ సమస్యకు పరిష్కారం అని తెలిపారు.