వర్షం అంటే వణుకుతున్నారు హైదరాబాద్ వాసులు. ఎందుకంటే మూడు రోజుల క్రితమే భారీ వర్షాలతో భయంకర అనుభవాలను చవిచూసిన భాగ్యనగర వాసులకు వర్షం పేరు ఎత్తితేనే భయం పుడుతోంది. ఇప్పుడిప్పుడే వరదల ప్రభావం నుంచి గాడిన పడుతున్న తరుణంలో శనివారం సాయంత్రం నగరంలో పలు చోట్ల భారీ వర్షం ప్రారంభం కావటంతో చాలా మందిలో టెన్షన్ ప్రారంభం అయింది. చిన్నపాటి వర్షం అయితే పర్వాలేదు. కానీ భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి అనేది లోతట్టు ప్రాంతాల ప్రజల ఆందోళన. ఇప్పటికే చాలా మంది ఇళ్లలో తాజాగా వచ్చిన వరదల తాలూకూ బురదే పోలేదు.
కానీ అప్పుడే మళ్ళీ వర్షం ప్రారంభం అయింది. అంతే కాదు..రాబోయే మూడు,నాలుగు రోజులు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది మరింత కలవరానికి గురిచేసే అంశం. ఓ వైపు ప్రజలు అందరూ నవరాత్రి ఉత్సవాలకు రెడీ అవుతున్న తరుణంలో వర్షం వదిలిపెట్టడం లేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల మళ్ళీ తెలంగాణలో పలు చోట్ల వర్షాలు ప్రారంభం అయ్యాయి. తాజాగా హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షంతో వచ్చిన వరదల కారణంగా కార్లు కొట్టుకుపోవటంతో పలువురు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.