హైదరాబాద్ లో వరద బాధితుల సాయంపై వివాదం నడుస్తోంది. బాధితులు చాలా మంది ఎమ్మెల్యేల ఇంటి ముందు సాయం కోసం ధర్నాలు చేస్తున్నారు. మరో వైపు సాయంలోనూ కమిషన్లు తీసుకుంటున్నారనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ స్పందించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
వరదల్లో నష్టపోయిన వారెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆర్థికసాయం అందలేదన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని మరికొద్ది రోజులు పొడిగించి అయినా.. అర్హులైన అందరికీ తక్షణ సహాయం అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివారం జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ రెవెన్యూ అధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.