మాణిక్యం ఠాకూర్ Vs కేటీఆర్

Update: 2024-01-31 12:47 GMT

Full Viewబిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ షాక్ ఇచ్చారు. తాజాగా ఆయన కేటీఆర్ కు పరువు నష్టం నోటీసు లు పంపించారు. వారం రోజుల్లో నోటీసులపై స్పందించాలని లేదంటే ..తదుపరి చర్యలు తప్పవన్నారు. ఇటీవల కేటీఆర్ సిరిసిల్లలో మాట్లాడుతూ తెలంగాణ సీఎం , టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేశారు. అయన పీసిసి పదవి 50 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు అని విమర్శించారు. వీటిపైనే ఇప్పుడు మాణిక్యం ఠాకూర్ తాజాగా కేటీఆర్ కు నోటీసులు పంపారు. కేటీఆర్ 7 రోజుల్లో స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని తెలిపారు. కేటీఆర్ కు పంపిన నోటీసుల్ని ఠాకూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నోటీసులపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. మాణిక్యం ఠాకూర్ ఎందుకు కన్ఫ్యూషన్ లో ఉన్నారు...వీటిని తప్పుదారి పట్టించారు అని వ్యాఖ్యానించారు. అవి తాను అన్న మాటలు కాదని.. అవి మీ సహచర కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాటలేనన్నారు.

తాను కేవలం వాటిని కోట్ చేశానని గుర్తు చేశారు. ఈ మేరకు ఓ పేపర్ కటింగ్ ను కూడా తన వాదనకు సాక్ష్యంగా కేటీఆర్ చూపించారు. పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన 50 కోట్ల లంచం వార్తలనే తాను ప్రస్తావించానని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ పై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదని కేటీఆర్ గుర్తు చేశారు. కోమటిరెడ్డి తాను చేసిన 50 కోట్ల లంచం వ్యాఖ్యల పైన వివరణ కూడా ఇవ్వలేదన్నారు. మీరు పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని.. నా చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండని కేటీఆర్ సూచించారు. అయితే ఈ ట్విట్టర్ రిప్లై కి మాణిక్య ఠాకూర్ సంతృప్తి చెందుతారా..లేక వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే నోటీసుల్లో పేర్కొన్నట్లు కోర్ట్ కి వెళ్తారా అన్నది వేచిచూడాల్సిందే. 

Tags:    

Similar News