ఉమ్మడి రాజధానిపై కుట్ర ...యూటీగా హైదరాబాద్

Update: 2024-05-04 12:58 GMT

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బిఆర్ఎస్ ఉక్కిరిబిక్కరి అవుతోంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో కూడా పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవటంతో ఆ పార్టీ కి చెందిన కీలక నేతలు సెంటిమెంట్ అస్త్రాలు వాడే ప్రయత్నం చేస్తున్నారు. విచిత్రం ఏమిటి అంటే అవి కూడా వర్క్ అవుట్ అవుతున్న దాఖలాలు లేవు. ఏ సర్వే చూసినా..ఏ అబిప్రాయసేకరణలో అయినా తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ మూడవ ప్లేస్ కే పరిమితం అవుతుంది అనే లెక్కలు వస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పినట్లే అటు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ దగ్గర నుంచి హరీష్ రావు, కెటిఆర్ లు తమకు లోక్ సభ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు వస్తాయని...సర్వేలు అన్ని ఇదే విషయం చెపుతున్నాయి అంటూ వ్యాఖ్యానిస్తూ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయి పరిస్థితులు ఏంటో వాళ్లకూ తెలుసు. అటు కాంగ్రెస్ పై ...ఇటు బీజేపీ పై ఎన్ని విమర్శలు చేసినా రాజకీయంగా పెద్దగా కలిసి వచ్చే అవకాశాలు ఏమీ కనిపించకపోవటంతో హరీష్ రావు..కేటీఆర్ లు లాస్ట్ బాల్స్ విసుర్తున్నట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

                                                                అందుకే అసలు ఎక్కడా చర్చ లేని ఉమ్మడి రాజధాని పొడిగింపు అంశాన్ని హరీష్ రావు తెరమీదకు తెచ్చారు. విభజన చట్టం ప్రకారం 2024 జూన్ వరకు మాత్రమే హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు అంటే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కానీ చంద్రబాబు తో పాటు మరికొంత మంది దీన్ని పొడిగించేందుకు కుట్రలు చేస్తున్నారు అంటూ హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ మాది అని కొట్లాడాలి అంటే గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలి అంటూ కరీంనగర్ ప్రచారంలో మాట్లాడారు. ఇదే తరహాలో కొద్దిరోజుల క్రితం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మరో కీలక అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అదేంటి అంటే జూన్ 2 తర్వాత హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు.

                                                               దీన్ని అడ్డుకోవాలంటే ఈ సన్నాసులు కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ వల్ల కాదు అని ..గొంతు విప్పి పార్లమెంట్ లో నిలదీసే జెండా గులాబీ జెండా అని...అందుకే లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు. అయితే వాస్తవానికి అటు హరీష్ రావు చెప్పినట్లు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం పొడిగించాలి అనే డిమాండ్ కానీ...కేటీఆర్ చెప్పిన కేంద్ర పాలిత ప్రాంతం డిమాండ్ కానీ ఎక్కడా లేవు. కేవలం ఈ లోక్ సభ ఎన్నికల్లో ఇలాంటి అంశాలను తెరమీదకు తెస్తే అయినా కొన్ని ఓట్లు పడి...ఒకటి అరా సీట్లు అయినా వస్తాయనే కెటిఆర్, హరీష్ రావు లు ఈ అంశాలను ప్రస్తావించినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. గత పదేళ్ల కాలంలో ఎన్నో సార్లు సెంటిమెంట్ అస్త్రాలు వాడి బిఆర్ఎస్ రాజకీయంగా లబ్ది పొందింది అని...ప్రతి సారీ అదే ప్రయోగం చేయటం పెద్దగా వర్క్ అవుట్ అయ్యే సూచనలు కూడా కనిపించటం లేదు. మరి కేటీఆర్, హరీష్ రావు ల లాస్ట్ బాల్స్ ఎంత మేర ఫలిస్తాయి అనేది జూన్ నాలుగున కానీ తేలదు.

Tags:    

Similar News