బిఆర్ఎస్..కెసిఆర్..కేటీఆర్ లు చెప్పిందే నమ్మాలి

Update: 2024-02-27 12:41 GMT

అధికారంలో ఉండగా కంపెనీయే ఖర్చు భరిస్తుంది అన్న కేటీఆర్

ఇప్పుడు సర్కారు రిపేర్లు చేయాలంటున్న మాజీ మంత్రి 

అధికారంలో ఉంటే ఒకలా..ఇప్పుడు కొత్త రాగం

కాళేశ్వరం పై కేటీఆర్ కొత్త కథ !

Full Viewకట్టించింది వాళ్లే. కూలింది కూడా వాళ్ళ హయాంలోనే. కానీ ఇప్పుడు మళ్ళీ ఛలో మేడిగడ్డ అంటూ కొత్త కార్యక్రమం. అధికారంలో ఉంటే ఒక కథ. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మరో కొత్త కథ. ఇదీ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీరు. అధికారంలో ఉంటే ఒక కథ. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మరో కొత్త కథ. గత ఎన్నికల ముందే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అత్యంత కీలకం అయినా మేడిగడ్డ పిల్లర్లు దెబ్బ తిన్న విషయం తెలిసిందే. అప్పటిలో ఇది చాలా చిన్న విషయం అని...నిర్మాణ సంస్థే దెబ్బతిన్న పనులు చేస్తుంది అంటూ కేటీఆర్ పలు మార్లు ప్రకటించారు. సీన్ కట్ చేస్తే అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కంపెనీ పనులు చేస్తుంది అనే మాటను పక్కన పెట్టి ప్రభుత్వమే రెండు నెలల్లో మరమ్మత్తులు చేసి నీళ్లు ఇవ్వొచ్చు అని నమ్మబలుకుతున్నారు కేటీఆర్. మరి దీనికి అయ్యే వ్యయం ఎంత...ఇది అంతా ఎవరు భరించాలి అనే విషయాలపై మాత్రం అయన ఇప్పుడు ఏమి మాట్లాడటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణ సంస్థ పనులు చేస్తుంది అని చెప్పి...ఇప్పుడు ప్రభుత్వమే పనులు చేయాలి...ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది అని ఆరోపణలు చేస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయి...అసలు ఈ ప్రాజెక్ట్ నిలబడటం కష్టమే...మళ్ళీ మొత్తం తిరిగి నిర్మించాల్సి ఉంటుంది అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులే చెపుతున్నారు. మరి కొంత మంది ఇంజినీర్లు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు అండ్ బిఆర్ఎస్ టీం అంతా...జాతీయ సంస్థ అయిన ఎన్ డీఎస్ ఏ నివేదికను నమ్మరు...రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్సు రిపోర్ట్ ను నమ్మరు. కానీ ప్రపంచం మొత్తం బిఆర్ఎస్ నాయకులు ఏది చెపితే అది మాత్రమే నమ్మి...అది మాత్రమే నిజం అని అనుకోవాలి అన్నట్లు ఉంది వీళ్ళ వైఖరి.

                            అంతే కాదు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేసి...లోపభూయిష్టంగా నిర్మాణాలు చేపట్టి తప్పును ఏ మాత్రం ఒప్పుకోకుండా..1957 నుంచి ప్రాజెక్ట్ లు కొట్టుకుపోయాయి...ఎన్నో ప్రాజెక్ట్ లు దెబ్బతిన్నాయి అని కేటీఆర్ చెప్పిన తీరు చూసిన వాళ్ళు ఎవరైనా అవాక్కు అవ్వక తప్పదు.   ఇదే కెటిఆర్ గతంలో కూడా ఇలాగే టిఎస్ పీ ఎస్ సి పేపర్లు లీక్ అయి లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడిన సమయంలో కూడా గుజరాత్ లో పేపర్లు లీక్ కాలేదా అంటూ ఎదురుదాడి చేసిన విషయం తెలిసిందే. కానీ దేశంలో ఎవరూ కట్టని రీతిలో అద్భుతంగా నిర్మించాం...తమకు తప్ప ఇలాంటి పనులు ఎవరికీ చేతకాదు అని ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ డొల్లతనం బయటపడ్డాక గతంలో ప్రాజెక్ట్ లు కూలలేదా..కొట్టుకుపోలేదా అని వాదిస్తే తప్పులు అన్నీ ఒప్పు అయిపోతాయా?. ఇప్పుడు పైగా మార్చి 1 న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా ఛలో మేడిగడ్డ కార్యక్రమం పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఒక్క మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు కుంగితే ప్రాజెక్ట్ అంతా వేస్ట్ అవుతుందా అనే వాదననే ప్రతిసారి తెరమీదకు తీసుకువస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ నుంచే అన్ని బ్యారేజీలకు నీళ్లు లిఫ్ట్ చేస్తారు అనే విషయం తెలిసిందే. మరి ఇదే దెబ్బతింటే ఇక మిగిలిన ప్రాజెక్టులో ఎన్ని ఉంటే ఏమి ఉపయోగం ఉంటుంది అన్న విషయాన్నీ కేటీఆర్, హరీష్ రావు లు చాలా కన్వెనినెంట్ గా మర్చిపోయి తమ తప్పులను కూడా ఇప్పటి ప్రభుత్వంపై తోసే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే కాళేశ్వరం పై రేవంత్ రెడ్డి సర్కారు కుట్ర చేస్తుంది అని కేటీఆర్ చెపుతున్నారు అంటే స్కెచ్ వేసుకునే రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో గట్టి చర్యలు తీసుకోకపోతే మాత్రం తీవ్ర విమర్శలు మూటగట్టుకోవాల్సి ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Tags:    

Similar News