ఈ షూ కంపెనీ లెక్క కుదరటం లేదే !

Update: 2024-10-25 05:50 GMT

అడిడాస్ షూ ఎంత ఫేమస్ బ్రాండో అందరికి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో అపాచీ ఫుట్ వేర్ సంస్థ ఈ షూస్ తయారుచేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో ఈ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. ఈ సంస్థకు అప్పటిలోనే 300 ఎకరాలు ఇచ్చారు. గత పదిహేను సంవత్సరాల్లో సాంకేతికంగా కూడా ఎన్నో మార్పులు జరిగి ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఎంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇది అంతా ఎందుకు అంటే తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నుంచి ఒక ప్రకటన వెలువడింది. అదేంటి అంటే దక్షిణ కొరియా కి చెందిన షూ ఆల్స్ సంస్థ తెలంగాణ లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధం ఉంది అని. అయితే 300 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే ఈ షూ కంపెనీ యూనిట్ ఏర్పాటుకు 750 ఎకరాల భూమి కోరింది. ఇదే ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేస్తున్న అంశం.

                                                                 తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావాలి..ఉపాధి అవకాశాలు పెరగాలి. కానీ ఆ కంపెనీ పెట్టే పెట్టుబడికి...అడిగే భూమికి మధ్య ఏ మాత్రం లింక్ లేదు అన్నది అధికారుల నుంచి కూడా వినిపిస్తున్న మాట. షూ ఇండస్ట్రీ అనేది ఎక్కువ మంది కార్మికులతో నడిచే పరిశ్రమ. ఇందులో సందేహం లేదు. ఎన్ని వెరైటీ ఉత్పత్తులు తయారు చేసినా...ఎన్ని యూనిట్స్ పెట్టిన కూడా కంపెనీ కోరిన భూమి...పెట్టుబడి లెక్కలు చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా ఉంది అన్న అనుమానం రాక మానదు. అయినా కూడా ఈ కంపెనీ 300 కోట్ల పెట్టుబడి పెడతామని..ఇందుకు 750 ఎకరాలు కావాలని కోరటం ఆశ్చర్యంగా ఉంది. మరో వైపు ఈ పెట్టుబడి ద్వారా 87 వేల మంది కి ఉపాధి కల్పిస్తామని చెప్పటం కూడా ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు అని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి.

                                                 గురువారం నాడు కంపెనీ ప్రతినిధులు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశం అయి పలు అంశాలపై చర్చించారు. కంపెనీ వినతిని తాము అత్యధిక ప్రాధాన్యత తో పరిశీలిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అధికారికంగా వెల్లడించారు. అయితే ఈ షూ కంపెనీ ద్వారా వచ్చే ఉద్యోగాలు కూడా కేవలం పదవ తరగతి వరకు చదివిన వాళ్ళు మాత్రమే చేసేవిగా ఉంటాయని చెపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులతో పాటు కేటాయించే భూములకు కూడా జస్టిఫికేషన్ (సమర్ధించుకునేలా) ఉండాలి కానీ..చూడగానే ఎవరికైనా వెంటనే అనుమానం వచ్చేలా ఉండకూడదు. మరో వైపు ఈ కొరియా కంపెనీ తెలంగాణ ప్రభుత్వం ఐదు వేల ఎకరాలు కేటాయిస్తే స్మార్ట్ సిటీ నిర్మాణం కూడా చేపడతామని ముందుకు వచ్చింది.

Tags:    

Similar News