కాంగ్రెస్ పార్టీ వాళ్లకు బలమా?. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కి బలమా?. నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా పట్టు చూపిస్తున్నారు. కానీ ఎన్నికలకు ముందు వీళ్ళిద్దరూ చేసిన హంగామా అంతా ..ఇంతా కాదు. ఇప్పుడు తనకు హామీ ఇచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని రోజూ కాంగ్రెస్ పార్టీ ని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏమి మాట్లాడారు. ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఉండి కూడా ఎన్నికలకు ముందు తెలంగాణ లో ఎంతో బలంగా ఉన్న బిఆర్ఎస్ ను ఓడించటం ఒక్క బీజేపీ కి మాత్రమే సాధ్యం అవుతుంది అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ని రాజకీయంగా ఇబ్బంది పెట్టే స్టేట్మెంట్స్ ఇవ్వటంతో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బీజేపీ లో చేరి అప్పటిలో మునుగోడు ఉప ఎన్నికకు కారణం అయ్యారు. విచిత్రం ఏమిటి అంటే బిఆర్ఎస్ ను తెలంగాణ లో బీజేపీ మాత్రమే ఓడించగలదు చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ చేతిలో ఓటమి పాలు అయిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన అప్పటిలో ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోగొట్టుకున్నారు. నిజంగా రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లే మునుగోడులో ఆయన కు కాంగ్రెస్ తో సంబంధం లేకుండా సొంత బలమే ఉంటే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనే గెలవాలి కదా మరి. కానీ ఏమి జరిగిందో అందరికి తెలిసిందే. పీసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి పై తీవ్ర అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉప ఎన్నికలో తన తమ్ముడు గెలుస్తాడు అని చెప్పుకొచ్చారు అప్పటిలో. వాళ్ళు అనుకున్నట్లు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే...ఎన్నికల ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీ లో చేరతారు అని అప్పటిలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ మునుగోడు లో ఓటమితో సీన్ రివర్స్ అయింది. కారణాలు ఏమైనా కూడా పార్టీ ని వీడిన రాజగోపాల్ రెడ్డి ని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి పిలిచారు...ఆయన మళ్ళీ కాంగ్రెస్ టికెట్ పై ముండుగోడులో గెలిచారు. ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చింది నిజమే అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఇటీవల స్పష్టం చేశారు.
అయితే ఇప్పటికే తెలంగాణ క్యాబినెట్ లో రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. తామిద్దరం సమర్థులమే తమకు ఇస్తే తప్పేంటి అంటూ గత కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి అటు పార్టీ ని..ఇటు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది నేతలు మాత్రం ఎన్నికలకు ముందు అన్నదమ్ములు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు ఇరకాటంలోకి పెట్టారో తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా రాజగోపాల్ రెడ్డి అయితే అసలు తమ వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని కొంత మంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాలు గమనిస్తే కాంగ్రెస్ బలమే వాళ్లకు ఉపయోగపడింది తప్ప...వాళ్ళ వల్లే కాంగ్రెస్ కు లాభం కలిగింది అనే వాదనలో నిజం లేదు అనే అభిప్రాయం ఎక్కువ మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా పదే పదే పార్టీ ని...ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలా మాట్లాడుతున్నా కూడా ఏమి చేయలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది అని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.