జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కు బిగ్ షాక్. పీజెఆర్ కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆమె గురువారం నాడు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కొద్ది రోజుల క్రితం ఆమె రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు పార్టీ మార్పు ఖాయం అని స్పష్టం అయింది. గురువారం నాడు ఇది అధికారికంగా జరిగింది. అయితే ఆమె మరి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్నది వేచిచూడాల్సిందే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో నిలిచేందుకు ఆమె టీఆర్ఎస్ కు వీడినట్లు సమాచారం. అయితే ఆమె ఏ సీటు కేటాయిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లో చేరిన అనంతరం విజయారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ఖైరతబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.
నేను పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు నన్ను బాధించాయి. షీ టీమ్‌లు పెట్టామని గొప్పగా చెప్పుకుంటున్నా.. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. పెన్షన్, రేషన్ కార్డుల కోసం పేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.రాష్ట్ర ప్రజల బాగోగులు పక్కన పెట్టారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుంది. సోనియా, రాహుల్ నాయకత్వంలో పని చేయడానికే కాంగ్రెస్‌లోకి వచ్చాను అని విజయారెడ్డి అన్నారు.