అవసరానికి అనుగుణంగా వైఖరిలో మార్పు
ఎవరైనా టీఆర్ఎస్ నుంచి మరో పార్టీలో చేరితే అది ఫిరాయింపు. దారుణమైన తప్పు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లు. మీడియా అలాంటివి చూస్తూ ఎలా ఊరుకుంటుంది. మీరు వాళ్లను నిలదీయాలి కదా అంటారు సీఎం కెసీఆర్. అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లు చేరితే మాత్రం అది రాజకీయ ఏకీకరణ. అభివృద్ధి కోసం వాళ్లంతట వాళ్లే వచ్చి చేరటం అంటారు దాన్ని. గత ప్రభుత్వాలు భూములు అమ్మితే అది రాష్ట్ర ఆస్తుల అమ్మకం. టీఆర్ఎస్ అమ్మితే మాత్రం అది రాష్ట్ర సంక్షేమం. గత ప్రభుత్వాలు అత్యంత కీలకమైన హైదరాబాద్ నగరం చుట్టుపక్కల భూములు మాత్రమే అమ్మాయి. ఇప్పుడు టీఆర్ఎస్ సర్కారు మాత్రం తెలంగాణ రాష్ట్రమంతటా భూముల విక్రయానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే సీఎం కెసీఆర్ మంగళవారం నాడు అసెంబ్లీలో కొత్త సూత్రీకరణ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసేవి అప్పులు కాదు..అవి నిధుల సమీకరణ అట. అంతే కాదు ఈ విషయం తెలుసుకోవాలని కూడా అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మరి ఇదే కెసీఆర్ అండ్ కో ఇటీవల వరకూ కేంద్రం అప్పులు చేయగా తప్పులేనిది తాము చేస్తే తప్పు ఎలా అవుతుంది అంటూ ప్రశ్నిస్తూ వచ్చారు. సడెన్ గా అప్పులు కాస్తా నిదులు సమీకరణంగా మారిపోయాయి. ఎప్పటికప్పుడు తన అవసరాలకు అనుగుణంగా సీఎం కెసీఆర్ ఫిరాయింపులపైనా..భూముల అమ్మకాలు..అప్పులపై కొత్త సూత్రీకరణలు చేస్తూపోతున్నారు. వాటిని తిప్పికొట్టడంలో ప్రతిపక్షాలు అంతగా సఫలం కాలేకపోతున్నాయనే చెప్పొచ్చు. మంగళవారం నాడు అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం సందర్బంగా మాట్లాడుతూ కెసీఆర్ అప్పులకు ఈ కొత్త భాష్యం చెప్పారు.