అయితే గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో సీఎం జగన్ తో ముఖాముఖి భేటీ అయిందే లేదు..అలాంటిది టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టాక కూడా ఇంకా జగన్ తమను పట్టించుకుంటారు అంటే ఎవరైనా నమ్ముతారా అని ఒక సీనియర్ నేత సందేహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందాం అనుకున్న వాళ్ళు తప్ప...జగన్ టికెట్ నిరాకరిస్తే ఆయా నేతలు వైసీపీ అభ్యర్థుల గెలుపుకు సహకరించటం జరిగే పని కాదు అని చెపుతున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థులను అటు ఇటు మార్పులు చేస్తున్నారు. వీళ్లకు కొత్త నియోజకవర్గాల్లో ఉన్న నేతలు ఎంత మేర సహకారం అందిస్తారు అన్న అంశంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల మార్పుకు సంబదించిన విషయాలు ఇలా ఉంటే గత నాలుగున్నర సంవత్సరాల పాలనా కాలంలోనే జగన్ వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇందులో ప్రధానమైనది ఉద్యోగల అంశం. ప్రతిపక్షంలో ఉండగా వాళ్లపై ఎక్కడ లేని ప్రేమ కురిపించిన జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం వాళ్లకు చుక్కలు చూపించారు అనే చెప్పాలి. అదనపు సాయాల సంగతి పక్కన పెట్టి జీతాలు కూడా సకాలంలో ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో పాటు రాజధాని అంశంలో నెల కొన్న గందరగోళం, రాష్ట్రంలో అద్వాన్న రోడ్లు, పోలవరం పడకేయటం, కేంద్రం నుంచి విభజన హామీలు సాదించుకోలేకపోవటం, ఇసుక వివాదాలు, దారుణమైన మద్యం విధానం వంటి విషయాలు ఎన్నో. మరి ఇన్ని సమస్యలను అధిగమించి జగన్ మార్పులు చేసి ప్రజలను మరో సారి తన వైపు తిప్పుకోగలరా అన్నది చూడాల్సిందే.