ప్రముఖ ఫార్మా సంస్థ హెటెరో డ్రగ్స్ పై ఐటి దాడుల వ్యవహారం కలకలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితమే రాంకీ సంస్థపై కూడా భారీ ఎత్తున దాడులు చేసిన అధికారులు పెద్ద ఎత్తున పన్ను చెల్లించని ఆదాయాన్ని గుర్తించారు. ఇప్పుడు హెటోరోపై కూడా దాడులు జరగటం పారిశ్రామికవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హెటిరో డ్రగ్స్ కార్పొరేట్ కార్యాలయంతో పాటు ఉత్పత్తి కేంద్రాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
వీటితో పాటు హెటిరో డైరెక్టర్లు, సీఈవో కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 20 బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ దాడులను చేపట్టినట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన పలు ఫార్మా కంపెనీల డీల్స్ పై ఐటి శాఖ నజర్ వేసినట్లు గత కొన్ని రోజులుగా పారిశ్రామిక వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా కొన్ని కంపెనీల్లో లావాదేవీల్లో అసాధారణ మార్పులు ఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు.