జూబ్లిహిల్స్ సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ పై కేసు నమోదు
జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ వివాదాల పుట్టగా మారుతోంది. గత కమిటీపై తీవ్రమైన అవినీతి, అక్రమాల ఆరోపణలు వచ్చాయి. అందుకే మొన్నటి ఎన్నికల్లో సభ్యులు కూడా విసిగిపోయి పాత కమిటీ ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. అంతే కాదు కమిటీలోని వారిపై ఫోర్జరీ డాక్యుమెంట్లు..అసలు ఇక్కడ లేని వ్యక్తులను తెరపైకి తెచ్చి రిజిస్ట్రేషన్ చేశారనే అంశంపై కేసు నమోదు అయింది..విషయం కోర్టుకెక్కింది కూడా. ఈ తరుణంలో జూబ్లి హిల్స్ హౌసింగ్ సొసైటీ నూతన ప్రెసిడెంట్, టీవీ5 ఎండీ రవీంద్రనాథ్, కోశాధికారి నాగరాజుపై కేసు నమోదు అవటం కలకలం రేపుతోంది. జూబ్లిహిల్స్ రోడ్డు నెం 78లోని 365 గజాల స్థలాన్ని క్రమబద్దీకరించారని..7 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని 1.65 కోట్ల రూపాయలకు కట్టబెట్టబోతున్నారని సురేష్ బాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు అయింది. అయితే దీనిపై సొసైటీ వివరణ ఇచ్చుకుంటోంది. అదేంటి అంటే 2005 లో ఏజీఎం మినిట్స్ ప్రకారమే తాము నిర్ణయం తీసుకున్నామని..అదే సమయంలో 254 ప్లాట్ ఓనర్ కు తప్ప..ఆ 365 గజాలు ఎవరికీ ఉపయోగపడదని చెబుతోంది. అయితే ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడో 2005లో తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఇప్పుడు క్రమబద్దీకరించాల్సిన అవసరం ఏమి వచ్చింది.
పాత తప్పులు అన్నీ బహిర్గతం చేసి...కొత్తగా ఎన్నికైన కార్యవర్గం సొసైటీకి మరింత మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాల్సింది కదా?. ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారం..హేతుబద్దమైన ధర నిర్ణయిస్తే ఈ విమర్శలకు ఛాన్స్ ఉండేది కాదు. కానీ కొత్త కమిటీ పాత జనరల్ బాడీ సమావేశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది. పాత నిర్ణయాలనే కొనసాగించేలా అయితే..ఈ కొత్త కమిటీకి అర్ధం ఏమి ఉంటుంది. గత కమిటీ చేసిన తప్పులు..అక్రమాలు పునరావృతం కాకుండా చేయాల్సిన వారే అప్పుడే వివాదాల్లో చిక్కుకోవటం కలకలం రేపుతోంది. మరో వర్గం మాత్రం జూబ్లిహిల్స్ క్లబ్ ఎన్నికలు ఉన్నందునే ఈ దుష్ప్రచారం ప్రారంభించారని కొంత మంది చెబుతున్నారు. అయినా ఎప్పడో 2005లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 2021లో అంటే 16 సంవత్సరాల తర్వాత కూడా అమలు చేశామనటం సరికాదు. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆలోచనలు..నిర్ణయాలు ఉంటేనే కొత్త కమిటీ భవిష్యత్ లో అయినా విమర్శలు ఎదుర్కోకుండా ఉంటుంది.