అత్యంత ప్రతిష్టాత్మకమైన టీ హబ్ 2ను ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం నాడు ప్రారంభించారు. స్టార్టప్ ల కు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కేంద్రంగా నిలవనుంది. ఏకంగా ఒకేసారి నాలుగు వేల స్టార్టప్ లకు చోటు కల్పించేందుకు వీలుగా దీన్ని డెవలప్ చేశారు. హైదరాబాద్ దేశ స్టార్టప్ ల రాజధానిగా మారనుందని సీఎం కెసీఆర్ వ్యాఖ్యానించారు. టీ హబ్ నేషనల్ రోల్ మోడల్ అని పేర్కొన్నారు. తెలంగాణ స్టార్టప్ పాలసీ స్పష్టంగా ఉందని వెల్లడించారు. టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ప్రముఖ అంకుర సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి సన్మానించారు. టీ హబ్ స్థాపించాలనే ఆలోచనకు ఎనిమిదేళ్ల కిందే అంకురార్పణ జరిగిందన్నారు కెసీఆర్. ప్రపంచంలో యువ భారత్ సామర్థ్యాన్ని తెలుపాలని టీ హబ్ ప్రారంభించినట్లు చెప్పారు. 2015లో మొదటి దశ టీ హబ్‌ను ప్రారంభించామని వెల్లడించారు. ఏడేళ్ల తర్వాత టీ హబ్ రెండో దశ ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. ఏడేళల్లో టీహబ్ ద్వారా 1200 అంకురాలకు సహకారం అందించినట్లు చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థకు అంకురాలు దోహదం చేస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు.
టీ హబ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు అధికారులను అభినందించారు సీఎం. హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్‌గా రూపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచంలో హైదరాబాద్ ఉత్తమ నగరమని తెలిపారు. స్టార్టప్‌లకు ప్రభుత్వమే ప్రోత్సహించడం తెలంగాణలోనే ప్రారంభమైందన్నారు. స్టార్టప్‌ల ద్వారా అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. టీ హబ్‌లో ఇప్పటికే చాలా కంపెనీలు తమ ప్రొడక్టులను ప్రారంభించాయని పేర్కొన్నారు. సక్సెఫుల్ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణ శైలితో పాటు అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో కొత్తగా రూపుదిద్దుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు రూ.276 కోట్ల వ్యయంతో అత్యాధునిక డిజైన్‌తో శాండ్ విచ్ ఆకారంలో దీన్ని నిర్మించారు.