ఆర్ఎస్ఎస్ పేరుతో మునుగోడు పై ఫేక్ సర్వే

Update: 2022-11-01 14:50 GMT

నవంబర్ 3 న జరగనున్న మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆర్ఎస్.ఎస్ సర్వే రిపోర్ట్ పేరిట ఒక అజ్ఞాత వ్యక్తి సంతకం చేసిన, నకిలీ పత్రం (Forgery document) ద్వారా ప్రజలను గందరగోళ పరచడానికి ఈ రోజు సోషల్ మీడియా లో అసత్య వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఆర్. ఎస్. ఎస్., అటువంటి సర్వే ఏదీ నిర్వహించలేదని స్పష్టం చేస్తూ, ఈ నకిలీ పత్రం ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యక్తి నిర్మాణము ద్వారా దేశ వైభవము సాధించాలనే మౌలికమైన లక్ష్యముతో 97 సంవత్సరాలుగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్థ. ఆర్. ఎస్. ఎస్. సంస్థాగతంగా రాజకీయాలతో గాని, రాజకీయ సర్వేలలోగాని పాలుపంచుకోదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైన అంశం కనుక ప్రజలందరూ నిర్భయంగా, తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రజలు అందరినీ ఆర్.ఎస్.ఎస్. ప్రోత్సహిస్తుంది.

ఆర్. ఎస్. ఎస్. వంటి సాంస్కృతిక, స్వచ్ఛంద సంస్థ పై ఇటీవల కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అసంబద్ధమైన, అసత్యమైన వార్తలు, కథనాలు, వ్యాఖ్యానాల ద్వారా అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేయడం అసమంజసం. ఈ విధంగా వ్యవహరించడం బాధ్యతాయుతమైన ఏ సంస్థకుగాని, వ్యక్తికి గానీ తగదు మరియు ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని, సామాజిక విలువలను అగౌరపరచడమే అవుతుంది. ఈ నకిలీ పత్రం ద్వారా జరుగుతున్న తప్పుడు వార్తలకు బాధ్యులైన వారిని గుర్తించి చట్ట బద్ధమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నాం అని ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News