టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కెసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో 150 ఎకరాల వరి వేసిన సీఎం కెసీఆర్ వడ్లు ఎవరు కొంటారో తెలంగాణ రైతుల వరి కూడా వాళ్ళే కొంటారన్నారు. కొనకపోతే వారి సంగతి చూద్దామని, రైతులు యాసంగిలో వరి వేయాలన్నారు. ఎర్రవెల్లి వెళితే ప్రభుత్వం, పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించారు. ఎర్రవెల్లి ఏమైనా పాకిస్తాన్, చైనాల్లో ఉందా?. ఎర్రవెల్లి వెళ్ళటానికి పాస్ పోర్టు కావాలా అని ప్రశ్నించారు. రచ్చబండకు వెళ్ళటానికి రెడీ అయితే హౌస్ అరెస్ట్ లు చేస్తూ ఎక్కడికి అక్కడ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారన్నారు. మీడియా స్వయంగా ఎర్రవెల్లి వెళ్లి 150 ఎకరాల్లో సీఎం కెసీఆర్ వరి వేశారో లేదో పరిశీలించవచ్చన్నారు. అందులో ఎకరా తక్కువ ఉన్నా తాను ఎలాంటి శిక్షకు అయినా రెడీ అని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యను పక్కదోవ పట్టించేందుకే బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారన్నారు.
గతంలో ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన సమస్యలపై మంత్రి కెటీఆర్ ఇంత సుదీర్ఘమైన లేఖ రాశారా అని ప్రశ్నించారు. సహజంగా బస్టాండ్లలో ఇద్దరు దొంగలు తాము కొట్టుకుంటున్నట్లు నటిస్తారని..అక్కడ జనం పొగు అయితే దొంగలు తమ పని తాము చేసుకుపోతారని..బిజెపి, టీఆర్ఎస్ పార్టీల పరిస్థితి అలాగే ఉందన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకే ఈ రెండు పార్టీలు కలసి ప్రజలను మోసం చేస్తున్నాయని..ఈ విషయాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా ప్రజలకు వివరించాలన్నారు. రైతులను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నది మోడీ, కెసీఆర్ లే అన్నారు. ఈ విషయాలను ప్రజలకు వివరించేందుకు రచ్చబండ కార్యక్రమాలను కొనసాగిస్తామని..ప్రజల మధ్యకు వెళతామని రేవంత్ ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.