ఏపీ...తెలంగాలో భారీ భారీ ప్రాజెక్ట్ లకు అనుమతి

Update: 2025-04-21 10:26 GMT

విస్తుపోతున్న తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు

ఒక కంపెనీ ఎన్ని రాష్ట్రాల్లో అయినా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆయా ప్రభుత్వాలు ఇచ్చే అనుమతులను బట్టి. కాకపోతే కొన్ని కంపెనీల విషయంలోనే పలు అనుమానాలు...సందేహాలు తలెత్తుతాయి. కొద్ది నెలల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎకో రెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయతలపెట్టిన విద్యుత్ ప్రాజెక్ట్ లకు ఆగమేఘాలపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం, సత్య సాయి జిల్లాల్లో ఈ కంపెనీ 1651 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనల కు ఆమోదం తెలిపింది. మరో వైపు ఇదే ప్రమోటర్ కు చెందిన లక్ష్మి ప్రసాద్ యెర్నేని డైరెక్టర్ గా ఉన్న మరో కంపెనీ అనంతపూర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ప్రభుత్వం 970 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపారు. దీంతో పాటు లక్ష్మి ప్రసాద్ యెర్నేని లింక్ ఉన్న మరి కొన్ని కంపెనీల ప్రతిపాదనలకు కూడా ఏపీ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత లక్ష్మి ప్రసాద్ యెర్నేని అటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న లింగమనేని రమేష్ కు సమీప బంధువు కావటంతో అప్పటిలో ఈ వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్ అధికార, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

                                                                   చంద్రబాబు గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నది లింగమనేని కి చెందిన కరకట్ట గెస్ట్ హౌస్ లోనే అన్న సంగతి తెలిసిందే. మరో వైపు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోనూ లింగమనేని రమేష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం అందరికి తెలిసిందే. కొద్ది నెలల క్రితమే ఈ కంపెనీ ఏపీ లో కొత్త ప్రాజెక్ట్ లు దక్కించుకోవటంతో పాటు మరి కొన్ని ఎకో రెన్ విద్యుత్ ప్రాజెక్ట్ లను ఇతర సంస్థలకు బదలాయిస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో భారీ మతలబులు ఉన్నాయనే ఆరోపణలు అప్పటిలో వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ఇదే ఎకో రెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వం తో అవగాహనా ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం తెలంగాణాలో కంపెనీ ఏకంగా 27 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. తెలంగాణాలో ఎకో రెన్ పలు జిల్లాల్లో విండ్ -సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ తో పాటు ఇతర ప్రాజెక్ట్ లు కూడా ఏర్పాటు చేయనుంది.

                                                                             అయితే తెలంగాణకు ఈ కంపెనీ పొలిటికల్ లింక్ లతో వచ్చిందా లేక నిజంగా ఆ కంపెనీకి అంత సత్తా ఉందా అన్న చర్చ తెలంగాణ అధికార వర్గాల్లో సాగుతోంది. మరో వైపు ఏపీలోని కీలక స్థానాల్లో ఉన్న కొంత మంది మంత్రులు తమ అవినీతి సొమ్మును విద్యుత్ ప్రాజెక్ట్ లోకి మళ్లిస్తున్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటికే ఉర్సా క్లస్టర్స్ అటు ఏపీలో..ఇటు తెలంగాణాలో పెట్టుబడుల వ్యవహారం దుమారం రేపుతున్న తరుణంలో ఇప్పుడు అందరి దృష్ఠి ఎకో రెన్ ప్రాజెక్ట్ పై పడింది. అసలు ఆ కంపెనీకి అంత మొత్తంలో పెట్టుబడులు పెట్టే సత్తా ఉందా అన్నది ఒకటి అయితే...తెలంగాణాలో ఈ భారీ ప్రాజెక్ట్ ల తెర వెనక ఎవరైనా ఉన్నారా అన్న చర్చ కూడా తెర మీదకు వస్తోంది అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వాలు కుదుర్చుకునే ఎంఓయు లు...భూ కేటాయింపులు దుమారం రేపుతున్నాయి.

                                                             తెలంగాణ ప్రభుత్వం ఇంత భారీ మొత్తంలో పెట్టుబడికి సంబంధించి ఎకో రెన్ తో ఎం ఓయు చేసుకునే ముందు కంపెనీ సత్తా...ట్రాక్ రికార్డు వంటి అంశాలను పరిశీలించి తగిన శ్రద్ద తీసుకుందా లేదా అన్న అంశంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అలా కాకుండా ఏదో నంబర్ల గేమ్ లాగా వేల కోట్ల రూపాయలు పెట్టుబడుల పేరు చెప్పి ఎంఓయూ లు చేసుకుని ప్రభుత్వ భూములను కేటాయించిన తర్వాత ఆ కంపెనీలు యూనిట్ లు ఏర్పాటు చేయకుండా సంవత్సరాల తరబడి జాప్యం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల అసలు ప్రమోటర్లు ప్రాజెక్ట్ ల నుంచి అన్ని అనుమతులు దక్కించుకుని తర్వాత ఎగ్జిట్ మార్గం కూడా చూసుకుంటున్నారు. ఎకో రెన్ భారీ పెట్టుబడుల ప్రతిపాదన వెనక ఉన్న అదృశ్య శక్తులు ఎవరై ఉంటారా అన్న చర్చ అధికార వర్గాల్లో ఉంది.

Tags:    

Similar News