139 టీఎంసీలు ఎత్తిపోస్తే మూడు వేల కోట్ల క‌రెంట్ బిల్లు

Update: 2022-07-22 12:04 GMT

కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో సీఎం కెసీఆర్ ఇంజ‌నీర్ల మాట‌లు కూడా ప‌ట్టించుకోలేద‌ని మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ వ్యాఖ్యానించారు. తాజాగా వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌తో కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి వేల కోట్ల రూపాయ‌ల మోటార్లు మునిగిపోతే ఎంతో అనుభ‌వం ఉన్న ఇంజ‌నీర్లు మౌనంగా ఉండ‌టం ఏ మాత్రం స‌రికాద‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ద‌గ్గ‌ర వేలాది ఎక‌రాలు భూసేక‌ర‌ణ‌తో సంబంధం లేకుండా మునుగుతున్నాయ‌ని తెలిపారు. ఈ ప్రాజెక్టు వ‌ల్ల తొలిసారి మంథ‌ని, మంచిర్యాల ప‌ట్ట‌ణాలు మునిగాయ‌న్నారు. 139 టీఎంసీలు ఎత్తిపోస్తే మూడువేల కోట్ల రూపాయ‌ల క‌రెంట్ బిల్లు వ‌చ్చింద‌ని ఈటెల రాజేంద‌ర్ తెలిపారు. రైతుల‌కు కాళేశ్వ‌రం ప్రాజెక్టే శ్రీరామ‌ర‌క్ష అని చెప్ప‌టం స‌రికాద‌న్నారు. ఈటెల రాజేంద‌ర్ శుక్ర‌వారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ లో తెలంగాణ జ‌ర్న‌లిస్టుల అధ్య‌య‌న వేదిక కాళేశ్వ‌రం ముంపు మాన‌వ త‌ప్పిద‌మా..ప్రకృతి వైపరీత్యమా అనే అంశంపై నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇన్ని అనుభవాల తర్వాత ప్రాజెక్టులపై జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైందన్నారు. తానే డిజైనర్,తానే సృష్టికర్త అని కేసీఆర్ అనుకునేవార‌ని ఈటెల వ్యాఖ్యానించారు. తాము రాజకీయ నాయకులం మాత్రమే. ఇంజనీర్లము కాద‌న్నారు. వరదలతో సంబంధం లేకుండా పంట నష్టపోతున్న రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం శాస్త్రీయ పద్దతిలో ఆలోచించాలని సూచించారు. నీళ్ళు కావాలని జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమ‌న్నారు. ప్రాజెక్టులు కట్టడం త‌నతోనే స్టార్ట్ అయిందనే లాగా కేసీఆర్ మాట్లాడడం బాధాకరమ‌ని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ మ‌ధు యాష్కీ మాట్లాడుతూ మేఘాలు బద్దలు కాలేదు. మేఘా అవినీతి బద్దలైందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కేసీఆరే ఇంజనీర్, డాక్టర్, మేధావి..కేసీఆర్ రాత్రి మెలకువగా ఉండి ఎవర్ని కుట్రలతో మోసం చేయాలనే ఆలోచిస్తాడన్నారు. కాళేశ్వరం ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమే అన్నారు. ర‌జత్ కుమార్ ను వెంట‌నే అరెస్ట్ చేయాలి. మేఘా ఇంజనీరింగ్ అధినేతను అరెస్ట్ చేయాలని వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీ నేతగా డిమాండ్ చేస్తున్నా అని తెలిపారు. అవినీతి చేయకున్నా కాంగ్రెస్ నేతలపై ఈడీ నోటీసులు.. అవినీతి చేసిన కేసీఆర్ పై మౌనమా?. కేసీఆర్ పై విచారణ చేయకపోతే ఆయన అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందని ఒప్పుకోవాలన్నారు. రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మణ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 102 మీటర్ల లెవల్ వద్ద నిర్మించారు... వచ్చిన వరద 105 మీటర్ల లెవల్ లో వచ్చిందంటున్నారు. మ‌రో రిటైర్డ్ ఇంజ‌నీర్ గోవ‌ర్ధ‌న్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక అత్యంత గొప్పవిగా చెప్పుకునే కాళేశ్వరం, మిషన్ భగీరథ ఫెయిల్ అయ్యాయ‌న్నారు. తుమ్మడిహెట్టి నుంచి కాళేశ్వరం కు ప్రాజెక్టును మార్చడం వల్ల ప్రభుత్వం పై గుదిబండల మారిందని తెలిపారు. కాళేశ్వరం పేరుతో నిర్మించిన మూడు బ్యారేజ్ లు తీవ్ర ముప్పు ను ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

Tags:    

Similar News