తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో టెన్షన్ రేపుతోంది. ఈ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ ఎన్నడూలేని రీతిలో అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ నివేదికను అధిష్టానానికి అందజేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పదవి రాకుండా చేసేందుకు సీనియర్ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బుధవారం నాడు కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. పీపీసీ అధ్యక్ష పదవి ఖరారు కానున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆయన కూడా గట్టిగా పీసీసీ పదవి కోరుతున్నారు. తనకు పదవి ఇస్తే పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన ఎక్కడా ఎలాంటి ప్రకటనలు చేయకుండా మౌనం పాటిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలహీనం అవటంతోనే రాష్ట్రంలో బిజెపి పుంజుకుంటుందనే వాదనలు ఉన్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అది నిరూపితం అయింది కూడా. ఈ తరుణంలో కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా అటు అధికార టీఆర్ఎస్, బిజెపిని సమర్ధవంతంగా ఢీకొట్టాల్సి ఉంటుంది.