చనిపోయిన రైతు కుటుంబాలకు తెలంగాణ తరపున మూడు లక్షల సాయం
కేంద్రం 25 లక్షల రూపాయలు ఇవ్వాలి
సీఎం కెసీఆర్ డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక ప్రకటన చేశారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ ఆందోళనలో పాల్గొని మరణించిన రైతుల కుటుంబాలకు మూడు లక్షల రూపాయల లెక్కన సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చనిపోయిన రైతుల జాబితా ఇవ్వాల్సిందిగా ఆయా సంఘాలను కోరుతున్నట్లు తెలిపారు. అదే సమయంలో ప్రధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు చట్టాలకు సంబంధించి మోడీ క్షమాపణ చెపితే చాలదని...రైతులపై పెట్టినన కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కొంత మందిపై ఏకంగా దేశ ద్రోహం కేసులు కూడా పెట్టారన్నారు. చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించినందున ఇప్పుడు కేసులు తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. సత్వరమే దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ సర్కారు కోరుతున్నట్లు వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదన్నారు. రేపు ఢిల్లీ వెళుతున్నామని కెసీఆర్ తెలిపారు. . వీలు అయితే ప్రధాని నరేంద్రమోడీని కూడా కలుస్తామని వెల్లడించారు. వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించి రైతుల పోరాటపటిమకు ధన్యవాదాలు..అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం నుంచి సమాచారం వచ్చింది.
ఇది నిజమో..అధికారికమో కాదో తేలాల్సి ఉందన్నారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. రైతులను ఆదుకోవాలి..అది ప్రజాస్వామ్యానికి అందం తెస్తుంది అని వ్యాఖ్యానించిరారు. రైతులు కనీస మద్దతు ధరకు చట్టం తీసుకురావాలి. ఈ పోరాటంలో తాము అండగా ఉంటామన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు అడుగుతున్నది కనీస మద్దతు ధర మాత్రమే. గరిష్టంగా ఏమీ కోరటం లేదు. దళారులు..వ్యాపారుల పాలు కాకుండా సాయం కోరుతున్నారు. ఇది న్యాయమైన సముచితమైన డిమాండ్ అన్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేసిన తరహాలో కొత్త విద్యుత్ చట్టాన్ని కూడా రద్దు చేయాలన్నారు. ఇది రైతులపై భారం మోపేదే అన్నారు. మోటార్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని..ఇది ఏ మాత్రం సముచితం కాదని తెలిపారు. క్రిష్ణా, గోదావరి జలాల్లో ఎవరి వాటా ఎంతో వెంటనే తేల్చాలన్నారు. కేంద్రం తన బాధ్యత నిర్వహణలో విఫలం చెందిందని ఆరోపించారు. ఇది తేల్చకపోతే ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.