తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి సంఘటన జరిగిన సందర్భం లేదు. దేశ ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో ప్రొటోకాల్. సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు. అంతే కాదు..ప్రధాని పాల్గొనే కార్యక్రమాల్లోనూ సీఎం ఉంటారు. ఏదైనా అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ సారి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికే కార్యక్రమంలో పాల్గొనకపోగా..ఆ తర్వాత ప్రధాని మోడీ హాజరైన కార్యక్రమాలకూ డుమ్మా కొట్టారు. ఇది అంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగింది. ఎప్పుడైతే మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు ప్రధాని స్వాగత వీడ్కోలు బాధ్యతలు అప్పగిస్తూ జారీ చేసిన లెటర్ ను లీక్ చేశారో అప్పుడే కెసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉండనున్నట్లు అర్ధం అయింది. దీనిపై సోషల్ మీడియాతోపాటు పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి. ప్రధానికి సీఎం స్వాగతం పలకటం అత్యంత సాధారణంగా జరిగే వ్యవహారం. కానీ సీఎం కెసీఆర్ శనివారం హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోడీకి స్వాగతం పలకటంతోపాటు ఆద్యంతం ఆయనతోపాటు ఉంటారని అధికారులతో లీక్ లు ఇప్పించి మరీ మీడియాలో ప్రత్యేకంగా వార్తలు రాయించారు. కానీ అసలు సమయానికి కెసీఆర్ స్కిప్ చేశారు. దీంతో అవాక్కవటం మీడియా వంతు అయింది. అంతే కాదు..జ్వరం కారణంగానే కెసీఆర్ ప్రధాని మోడీ కార్యక్రమాలకు హాజరు కాలేకపోయారనే మరో లీక్ వచ్చింది.
కానీ విషయం ఏమిటో తాజా పరిణామాలను గమనించిన వారందరికీ అర్ధం ఆవుతుంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ ప్రధాని కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం పక్కా ప్లాన్ ప్రకారమే అన్న విషయం ఆ పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాల ద్వారా కూడా స్పష్టం అవుతోంది. ఓ వైపు తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లో పెట్టడంతోపాటు మోడీ పర్యటించే రహదారులపై భారీ ఫ్లెక్సీలు పట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏది ఏమైనా ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా సీఎం కెసీఆర్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు కూడా దీనిపై ఎవరికి తోచిన కామెంట్లు వారు చేస్తున్నారు. గతంలో ప్రధాని మోడీ భారత్ బయోటెక్ కు వచ్చినప్పుడు సీఎం కెసీఆర్ ను రావొద్దని అవమానించారని..ఇప్పుడు సీఎం కెసీఆర్ అదే తరహాలో మోడీకి సమాధానం చెప్పారంటూ కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే ఎక్కువ మంది మాత్రం సీఎం కెసీఆర్ తీరును తప్పుపట్టిన వారే ఉన్నారు.