అంతా జెట్ స్పీడ్ లో జరిగిపోయింది. కాంగ్రెస్ర్ నేతలు అలా వినతిపత్రం ఇచ్చారు. ముఖ్యమంత్రి కెసీఆర్ వాటిపై అంతే స్పీడ్ గా స్పందించారు. కాంగ్రెస్ నేతలు కోరిన మేరకు పలు నిర్ణయాలు వెలువరించారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిజిపి మహేందర్ రెడ్డి ని ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సిఎం స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సిఎం కెసిఆర్ తెలిపారు. కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేయాలని, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందచేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. చింతకాని కి వెల్లి లాకప్ డెత్ సంఘటనా పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డిజిపీని సిఎం ఆదేశించారు. సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
మరియమ్మ లాకప్ డెత్ సంఘటనలో పోలీసుల తీరు పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 28వ తేదీన స్థానిక ఎమ్మెల్యే కాంగ్రేస్ శాసన సభా పక్షనేత భట్టి విక్రమార్కతో కలిసి స్థానిక మంత్రి పువ్వాడ అజయ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు సహా, జిల్లా కలెక్టర్, ఎస్సీ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి రావాలని సిఎం సూచించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ '' దళితుల పట్ల సమాజం దృక్పథం మారవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా పోలీసుల ఆలోచనా ధోరణి, దళితుల పట్ల, పేదల పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. శాంతి భధ్రతలను కాపాడడంలో గుణాత్మక అభివృద్దిని సాధిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థలో, ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం.వీటిని క్షమించం. దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు. తక్షణమే కఠిన చర్యలుంటాయి. ఈ లాకప్ డెత్ కు కారణమైన వారిపై విచారణ నిర్వహించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయకూడదు. అవసరమైతే ఉద్యోగం లోంచి తొలగించాలి'' అని డీజీపీని మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.