ప్ర‌ధాని మోడీకి కెసీఆర్ లేఖ‌

Update: 2022-03-29 15:01 GMT

యుద్ధం కార‌ణంగా ఉక్రెయిన్ నుంచి వెన‌క్కి వ‌చ్చిన వైద్య విద్యార్ధుల అంశంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ మంగ‌ళ‌వారం నాడు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి లేఖ రాశారు. ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్య‌సించ‌టానికి వెళ్లిన వారంతా మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన వారేన‌ని..వారు ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన ఖ‌ర్చు..స‌మ‌యాన్ని గ‌మ‌నంలోకి తీసుకుని తిరిగొచ్చిన విద్యార్ధుల‌కు ఎలాంటి అవాంత‌రాలు లేకుండా విద్యాభ్యాసం పూర్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త‌న లేఖ‌లో కెసీఆర్ కోరారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 20 వేల మంది భారతీయ వైద్య విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ నుంచి దాదాపు 700 మంది విద్యార్థులు ఉక్రెయిన్‎లో వైద్య విద్యను అభ్యసిస్తునందున వారి పైచదువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్ర‌త్యేక అనుమ‌తులు ఇవ్వాల‌న్నారు. అది కూడా ఈ ఒక్క‌సారికే వ‌ర్తించేలా ఇవ్వాల‌న్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి ప‌లు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంద‌ని సీఎం కేసీఆర్ లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 700 మంది విద్యార్ధుల వైద్య విద్య‌కు అయ్యే ఖ‌ర్చు అంతా తామే భ‌రిస్తామ‌ని, ఇందుకు అనుగుణంగా సీట్లు పెంచ‌టంతోపాటు అవ‌స‌ర‌మైన అన్ని అనుమ‌తులు మంజూరు చేయాల‌న్నారు. మాన‌వ‌తా కోణంలో సాధ్య‌మైనంత వేగంగా దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు.

Tags:    

Similar News