ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం నాడు యాదాద్రి ఆలయ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. ఆలయంలో పూజల అనంతరం కెసీఆర్ అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణం, క్యూలైన్ నిర్మాణం పనులు, మండపాలు , గర్భ గుడి తదితర పనుల పురోగతి పరిశీలించారు. ఆలయ నిర్మాణం పనులు 90 శాతానికి పైన పూర్తికావడం సంతృప్తి వ్యక్తం చేశారు. పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యం లో, యాదాద్రి దివ్య క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో తీర్చి దిద్దుకుంటే, రానున్న మే మాసంలో పునఃప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయని ముఖ్య మంత్రి కె. చంద్ర శేఖర్ రావు పేర్కొన్నారు. సుమారు ఆరు గంటలకు పైగా కెసీఆర్ ఆలయ ప్రాంగణం తో పాటు ఆలయం చుట్టు పక్కల అనుబంధంగా జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అలయ చుట్టూ ప్రహరీకి మరింత శోభను ఇచ్చేలా, ప్రాచీన చిత్రకళ ఉట్టిపడేలా అలంకృత రూపం(ఆర్ణమెంటల్ లుక్కు)' తో వుండేలా, బ్రాస్ మెటల్ తో సుందరంగా తయారు చేయాలన్నారు. ఆలయాన్ని దూరం నుంచి దర్శించిన భక్తులకు భక్తి భావన వుట్టి పడేలా దీపాలంకరణ ఉండాలన్నారు. దేవాలయ ముందుభాగం కనుచూపు మేర నుంచి చూసినా అత్యద్భుతంగా తీర్చి దిద్దాలని,. ప్రాచీనత, నవ్యతతోపాటు దైవ సందర్శకులకు,భక్తి వైకుంఠంలో సంచరించే అనుభూతిని కలిగించాలని కోరారు. తుది మెరుగులు దిద్దు తున్న నేపథ్యం లో, దేశం లోని వివిధ ఆలయాల్లో శిల్ప సంపద ఎలా ఉందో చూసి రావాలని అధికారులకు సూచించారు. ప్రహ్లాద చరిత్ర సహా...నరసింహుని చరిత్రను తెలియ పరిచే పురాణ దేవతల చరిత్రలు అర్ధమయ్యేలా శిల్పాలతో ఆలయ ప్రాంగణం లో అలంకరించాలన్నారు.
ప్రహరీని ఆనుకుని వుండే విధంగా క్యూలైన్ నిర్మాణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. సౌకర్యవంతమైన ఎత్తుతో విశాలంగా క్యూ లైన్ దారిని నిర్మించాలని కోరారు. అత్యద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దుతున్నపుడు హడావిడి పడకూడదన్నారు. తిరుపతిలో లాగా, స్వామి వారికి సేవలందేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారని, వారికి అన్ని ఏర్పాట్లు అందేలా ప్రభుత్వం యాదాద్రిని తీర్చిదిద్దుతున్నదన్నారు. ఒడిషాలోని పూరీ జగన్నాథ ఆలయంలో మాదిరిగా... రిటైరైన పూజారులు, పేద బ్రాహ్మణ పెద్దలు తమ భుక్తి నీ వెల్లదీసుకునేలా, దయగల భక్తుల నుంచి కానుకలు స్వీకరించి వారి జీవన భృతిని కొనసాగించేలా ఇక్కడ కూడా మండపం నిర్మాణం ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం పూరీ ఆలయాన్ని సందర్శించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.