ముఖ్యమంత్రి కెసీఆర్ ను శుక్రవారం నాడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కలిశారు. ఈ సందర్భంగా కెసీఆర్ ఆయనకు పలు వరాలు ప్రకటించారు. హైదరాబాద్ లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇటీవల ఆయనకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రగతిభవన్ లో మొగిలయ్య ను సిఎం కెసిఆర్ శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు.
మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున ప్రకటించిన సాయం విషయంపై మొగిలయ్య తో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సిఎం ఆదేశించారు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు.